మా ఇంటి కోర్టుకు రండి: సుప్రీం కోర్టు జడ్జిలకు కర్ణన్ ఝలక్
కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ మరో షాక్ ఇచ్చారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)తోపాటు మరో ఆరుగురు జడ్జీలు తన ఎదుట హాజరవ్వాలని జస్టిస్ కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు.
న్యూఢిల్లీ: కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ మరో షాక్ ఇచ్చారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)తోపాటు మరో ఆరుగురు జడ్జీలు తన ఎదుట హాజరవ్వాలని జస్టిస్ కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ నెల 28న తన ఇంటి కోర్టుకు రావాలని పేర్కొన్నారు. వీరంతా ఇంతకుముందు జస్టిస్ కర్ణన్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేశారు. ఏడుగురు జడ్జిల ధర్మాసనం తనను ఉద్దేశపూర్వకంగా అవమానించిందని ఆయన పేర్కొన్నారు.

నాపై ఆరోపణలకు వివరణ ఇవ్వాలి
ఎస్సీ,ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్లు తాను మోపిన ఆరోపణలపై వారు వివరణ ఇచ్చుకోవాలన్నారు. దళితుడిని కావడం వల్లే తాను వివక్షకు లోనైనట్లు జస్టిస్ కర్ణన్ ఆరోపిస్తున్నారు.
గురువారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 28న ఉదయం 11.30 గంటలకు ఏడుగురు న్యాయమూర్తులు తన ఇంటి కోర్టులో హాజరు కావాలని, వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు.
తన తాత్కాలిక కోర్టుగా చెబుతున్న నివాసం నుంచే సుమోటు జ్యుడీషియల్ ఆదేశాల్ని జారీ చేశారు. మార్చి 31న సీజేఐ జస్టిస్ జేఎస్ ఖేహర్ తన మానసిక ఆరోగ్యాన్ని ప్రశ్నించారనీ, దానిని ధర్మాసనంలోని ఆరుగురు న్యాయమూర్తులు సమర్థించారనీ, అది తనను అవమానించినట్లేనన్నారు.
కాగా, కోర్టు ధిక్కరణ కేసులో మార్చి 31న జస్టిస్ కర్ణన్ సుప్రీం కోర్టుకు హాజరయ్యారు. ఆయన చాలా రోజులుగా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు.
భారత న్యాయ వ్యవస్థ చరిత్రలో ప్రథమం
ఒక హైకోర్డు జడ్జి కోర్టు ధిక్కారం కింద సుప్రీం కోర్టుకు ఎదుట హాజరవడం భారత న్యాయవ్యవస్థ చరిత్రలో ఇదే మొదటిసారి కాగా, చీఫ్ జస్టిస్, మరో ఆరుగురు సుప్రీం న్యాయమూర్తులు తన ఇంటి కోర్టులో హాజరు కావాలని నోటీసులు ఇవ్వడం కూడా ఇదే ప్రథమం.












Click it and Unblock the Notifications