ప్రమాణస్వీకారం: సుప్రీంకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్
సుప్రీంకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గొగోయ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈశాన్య భారతం నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన వారిలో తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు జస్టిస్ రంజన్ గొగోయ్. రంజన్ గొగోయ్ పదవీకాలం వచ్చే ఏడాది నవంబర్‌తో ముగుస్తుంది. ప్రస్తుతం పదవీవిరమణ చేసిన మాజీ ఛీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా తర్వాత రంజన్ గొగోయ్ సీనియర్‌గా ఉన్నారు. జస్టిస్ దీపక్ మిశ్రా కూడా తన వారసునిగా జస్టిస్ రంజన్ గొగోయ్ పేరునే ప్రతిపాదించారు.
Watch LIVE: Swearing-in-Ceremony of the Chief Justice of India Shri Justice Ranjan Gogoi at Rashtrapati Bhavan https://t.co/3kLEElsSBv
— President of India (@rashtrapatibhvn) October 3, 2018
Swearing-in Ceremony at @rashtrapatibhvn pic.twitter.com/RwbLOOFtK2
— Ranjan Gogoi (@Ranjan_GogoiCJI) October 3, 2018

జడ్జిగా జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రస్థానం
ఫిబ్రవరి 2001 నుంచి శాశ్వత న్యాయమూర్తిగా గౌహతి హైకోర్టునుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించారు జస్టిస్ గొగోయ్. అక్కడి నుంచి పంజాబ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా 2010లో బదిలీ అయ్యారు. అనంతరం 2011లో అదే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2012 ఏప్రిల్ 23న సుప్రీంకోర్టు జడ్జీగా బాధ్యతలు చేపట్టారు రంజన్ గొగోయ్. జస్టిస్ గొగోయ్ మరో ముగ్గురు న్యాయమూర్తులతో కలిసి సుప్రీంకోర్టు పాలనా వ్యవహారాలను తప్పుబడుతూ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయన సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టేందుకు అర్హుడు కాదంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ఆ పిటిషన్‌ను జస్టిస్ దీపక్ మిశ్రా కొట్టివేశారు.

కీలక కేసులు విచారణ చేయనున్న జస్టిస్ రంజన్ గొగోయ్
ప్రస్తుతం పలు కీలక కేసులను ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పర్యవేక్షిస్తున్నారు. ఇందులో అస్సోంలోని అక్రమవలసదారుల కేసు, లోక్‌పాల్ నియామకం కోరుతూ దాఖలైన పిటిషన్‌ను, కోల్‌కతా హైకోర్టు జడ్జి జస్టిస్ సీఎస్ కర్ణన్ కోర్టు ధిక్కారణ కేసును విచారించిన ఏడుగురు సభ్యుల ధర్మాసనంలో ఒక సభ్యుడిగా జస్టిస్ రంజన్ గొగోయ్ ఉన్నారు. అంతేకాదు రాజకీయనాయకులపై వేగవంతమైన విచారణ జరిగేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వానికి సూచించిన బెంచ్‌కు నేతృత్వం వహించారు జస్టిస్ రంజన్ గొగోయ్. ఈ ఏడాది మేలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారంతా తమ బంగ్లాల్లోనే ఉండొచ్చని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసిన యూపీ సర్కార్ నిర్ణయం తప్పని తీర్పు చెప్పారు జస్టిస్ రంజన్ గొగోయ్. పదవీ ముగిసిన తర్వాత ప్రభుత్వ బంగ్లాలో ఉండేందుకు అర్హులు కారని ఆయన తీర్పునిచ్చారు.

జస్టిస్ రంజన్ గొగోయ్ మృదు స్వభావి
ప్రజాస్వామ్యంను పరిరక్షించడంలో ముందుగా ఉండేది జడ్జీలు ఆ తర్వాత జర్నలిస్టులేనంటూ ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా జస్టిస్ గొగోయ్ వ్యాఖ్యానించారు. జస్టిస్ రంజన్ గొగోయ్ క్రమశిక్షణతో నడుచుకునే వ్యక్తి అని అతని సహచరులు చెబుతున్నారు. తను కేవలం చర్యలతోనే సమాధానం చెబుతారని వెల్లడించారు. బంధాలకు బాంధవ్యాలకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి రంజన్ గొగోయ్ అని కొనియాడారు. స్వతహాగా జస్టిస్ రంజన్ గొగోయ్ మృదు స్వభావి అని సహచర న్యాయమూర్తులు చెబుతున్నారు. చాలా తక్కువగా మాట్లాడే జస్టిస్ గొగోయ్... తన చేతల ద్వారానే మాట్లాడతారని అన్నారు.












Click it and Unblock the Notifications