కల్తీసారా బాధితులపై కమల్ హాసన్ వింత వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడు కల్తీసారా ఘటనపై ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కల్తీసారా ఘటనలో బాధితులు అజాగ్రత్తగా ప్రపర్తించారని వ్యాఖ్యానించారు.
పరిమితిని మించిపోయారని చెప్పుకొచ్చారు. కళ్లకురిచ్చి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్న బాధితులను ఆదివారం ఆయన పరామర్శించారు.
అనంతరం కమల్ హాసన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో తగినంత మద్యం అందుబాటులో ఉందని చెప్పారు. ఫార్మసీ స్టోర్ల కన్నా TASMAC మద్యం రిటైల్ అవుట్‌లెట్లు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.

'కల్తీసారా ఘటన బాధితుల పట్ల నాకు సానుభూతి లేదని నేను చెప్పను. కానీ వారంతా తమ పరిమితిని మించిపోయారని అర్థం చేసుకోవాలి. చాలా అజాగ్రత్తగా ప్రవర్తించారు. ఎవరైనా ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. మద్యపాన అలవాటు అనేది అకేషనల్(ఎప్పుడో ఒకసారి)గా ఉండాలి. చక్కెర గానీ ఏ పదార్థం గానీ అతిగా తీసుకుంటే హాని కలిగిస్తుందని అంతా అర్థం చేసుకోవాలి' అని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు.
#WATCH | Tamil Nadu: After meeting the Hooch tragedy victims, MNM party chief Kamal Haasan says, "...These victims will have to understand they have exceeded their limit and they have been careless. They have to be careful. They have to take care of their health. My request to… pic.twitter.com/qrci9g8OFs
— ANI (@ANI) June 23, 2024
అయితే, రాష్ట్రంలో కల్తీ సారాను అరికట్టాల్సిన డీఎంకే ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేయకుండా.. బాధితులనే తప్పుపట్టడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కమల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తమిళనాడులో అక్రమ మద్యం సమస్యను పరిష్కరించకుండా బాధితులను నిందిస్తున్నారని బీజేపీ నాయకుడు అమిత్ మాల్వియా విమర్శించారు.
మాల్వియా తన ఎక్స్ పోస్ట్‌లో.. "తమిళనాడులో స్వేచ్ఛగా లభించే అక్రమ మద్యానికి ఎంకే స్టాలిన్ ప్రభుత్వాన్ని బాధ్యులను చేసే బదులు కమల్ హాసన్ హూచ్ విషాద బాధితులను నిందిస్తున్నారు. ఇంత దారుణమైన వ్యాఖ్య చేయడానికి ఎవరైనా దిగజారాల్సిందే. అయితే ఇండి కూటమి నుంచి ఇంకా ఏమీ ఆశించవచ్చు అని దుయ్యబట్టారు.
అంతకుముందు తమిళనాడు వెట్రి కజగం అధ్యక్షుడు, నటుడు విజయ్.. కల్లకురిచ్చి వచ్చి బాధితులను స్వయంగా పరామర్శించి వారి ఆరోగ్యం గురించి అడిగి పరామర్శించారు. బాధితులను ఆదుకోవాలని నిర్వాహకులను కోరారు.
డీఎంకే ప్రభుత్వ నిర్లక్ష్యమే కల్లకురిచ్చి విషం కలిపిన మద్యం ఘటనకు కారణమని, ఈ ప్రభుత్వం నిద్రమేల్కొని తక్షణమే చర్యలు తీసుకుంటే ఈ దురదృష్టకర ఘటనలు జరిగేవి కావని అన్నారు. ఎడప్పాడి పళనిస్వామి కూడా కళ్లకురిచి మద్యం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని అన్నారు. అదేవిధంగా కల్లుకురిచి విషపూరిత మద్యం ఘటనపై అన్నాడీఎంకే నిరసన ప్రకటించింది.
అదే విధంగా కళ్లకురిచ్చి విషపూరిత మద్యం ఘటనకు వ్యతిరేకంగా తమిళనాడు బీజేపీ తరపున తమిళనాడు వ్యాప్తంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రతి జిల్లా రాజధానిలో ఆయా జిల్లాల నాయకులు, పార్టీ సీనియర్ అధికారులు ప్రదర్శనలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications