కంగనా చెంపదెబ్బ వివాదం-మహిళా కానిస్టేబుల్ కు మద్దతుగా భారీ ఆందోళనకు రైతులు..!
బీజేపీ నుంచి తొలిసారి ఎంపీగా గెలిచిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ను వివాదాలు మాత్రం వీడటం లేదు. ఇప్పటికే ఎంపీ కాకముందే ఆమె చేసిన పలు వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం, వాటిపై బీజేపీ సైతం ఇరుకునపడటం జరిగిపోయాయి. ఇప్పుడు ఎంపీ అయిన తర్వాత చంఢీఘడ్ ఎయిర్ పోర్టులో ఓ రైతు కుటుంబానికి చెందిన సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ చెంపదెబ్బ కొట్టడంతో ఈ వ్యవహారం జాతీయ స్ధాయిలో చర్చనీయాంశమైంది.
సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ కుల్వీందర్ తాను కంగనాను చెంపదెబ్బ కొట్టడానికి దారి తీసిన కారణాన్ని ఇప్పటికే వెల్లడించారు. గతంలో ఢిల్లీలో నిరసన చేస్తున్న రైతులను ఉద్దేశించి 100, 200కు వస్తున్నారంటూ కంగనా చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం అన్నారు. అయితే కారణం ఏదైనా ఓ ఎంపీపై దాడి చేయడం నేరం కాబట్టి ఆమెను సీఐఎస్ఎఫ్ సస్పెండ్ చేసి విచారణ చేస్తోంది. దీంతో ఆమెకు తిరిగి ఆ రైతులే అండగా నిలుస్తున్నారు.

ప్రముఖ రైతు సంఘాలైన సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా ఇవాళ కుల్విందర్ కౌర్‌కు మద్దతుగా నిలిచాయి. ఎస్కేఎం (నాన్ పొలిటికల్) నేత జగ్జిత్ సింగ్ దల్లేవాల్, కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్ సింగ్ పంధేర్ ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ కోరారు. ఇందుకోసం పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌరవ్ యాదవ్‌ను కలవాలని భావిస్తున్నట్లు తెలిపారు.
దీంతో పాటు మరింత ఒత్తిడి పెంచేందుకు జూన్ 9 న మొహాలీలో ఇన్సాఫ్ మార్చ్ ( న్యాయం కోసం ర్యాలీ) చేపట్టాలని నిర్ణయించాయి. మహిళా కానిస్టేబుల్‌కు ఈ కేసులో అన్యాయం జరగకూడదని డిమాండ్ చేయడానికి డీజీపీ ఆఫీసు వరకూ ఈ మార్చ్ చేపట్టనున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి.












Click it and Unblock the Notifications