సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్ ఫ్యామిలీ కీలక నిర్ణయం
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో- ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. మొత్తం 224 నియోజకవర్గాలకు మే 10వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచార తీవ్రతను పెంచాయి. విజయం సాధించడానికి నియోజకవర్గ స్థాయిలో విస్తృతంగా పర్యటిస్తోన్నాయి. గెలిచి తీరాలనే పట్టుదలను ప్రదర్శిస్తోన్నాయి.
భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ జాతీయ స్థాయి నాయకులు కర్ణాటకలో మకాం వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శని, ఆదివారాల్లో కర్ణాటకలో పర్యటించనున్నారు. శని, ఆదివారాల్లో ఆయన బెంగళూరు, రామనగరల్లో రోడ్ షో, బహిరంగ సభలను నిర్వహించనున్నారు. ఇప్పటికే రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, శివరాజ్ సింగ్ చౌహాన్.. వేర్వేరు జిల్లాల్లో రోడ్ షోలను నిర్వహించారు.

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ ఇక్కడే మకాం వేశారు. ఉత్తర కర్ణాటక జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గురువారం దక్షిణ కన్నడ జిల్లాలో పర్యటించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత రాష్ట్రం ఇదే కావడంతో ఈ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
స్టార్ హీరో కిచ్చ సుదీప్.. బీజేపీ తరఫున ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోన్నారు. ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తోన్నారు. రోడ్ షోలను నిర్వహిస్తోన్నారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో కలిసి బహిరంగ సభల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోన్నారు. ఎస్టీ రిజర్వ్డ్ స్థానం మొలకల్మూరుతో తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. జగ్లూరు, దావణగెరె నార్త్, దావణగెరె సౌత్, సండూర్.. వంటి చోట్ల ప్రచారం చేయనున్నారు.
ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్ పార్టీకి బిగ్ బూస్ట్ లభించనుంది. శాండల్‌వుడ్ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ భార్య గీత శివరాజ్‌కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ మధ్యాహ్నం 12 గంటలకు బెంగళూరులో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత డీకే శివకుమార్ సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఆమెకు రాజకీయాలు కొత్తేమీ కాదు. ఆమె- కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కుతురే.
2014 లోక్‌సభ ఎన్నికల్లో జనతాదళ్ (సెక్యులర్) తరఫున పోటీ కూడా చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సొరబ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న తన సోదరుడు మధు బంగారప్ప తరఫున గీత శివరాజ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మరో సోదరుడు కుమార బంగారప్ప ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిలో పోటీలో ఉన్నారు. ప్రస్తుతం ఆయనే ఇక్కడ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే.












Click it and Unblock the Notifications