కూతురిపై లైంగికదాడి, కేసు విత్ డ్రా చేసుకోవాలని దాడి, మృగాళ్ల దాడిలో బాధితురాలి తల్లి..
కూతురిపై లైంగికదాడి చేసిన కీచకులు.. కేసు విత్ డ్రా చేసుకోవాలని బెదిరించారు. అయినా ఆ తల్లి వినలేదు. ఇంకేముంది, వారి ఇంట్లోనే దారుణంగా కొట్టారు. ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయంది. తీవ్ర గాయాలతో యువతి తల్లి చనిపోయింది. ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో 2018లో జరిగిన లైంగికదాడి నిందితులు చేసిన దాష్టికమిది. మహిళపై యువకులు దాడిచేస్తోన్న 5 సెకన్ల వీడియో ట్రోల్ అవుతోంది.

బెయిల్‌పై బయటకొచ్చి..
కాన్పూర్‌కి చెందిన మైనర్ బాలికపై 2018లో అబిద్, మింటు, మహబూబ్, చాంద్ బాబు, జమీల్, ఫిరోజ్ అనే ఆరుగురు మృగాళ్లు లైంగికదాడికి తెగబడ్డారు. ఈ విషయం అప్పట్లో బాలిక ఇంట్లో చెప్పడంతో కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేయగా.. వారు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అయితే కేసు విచారణలో భాగంగా నిందితులకు స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

విత్ డ్రా..
బెయిల్ మీద బయటకొచ్చిన మృగాళ్లు.. గత వారం యువతి ఇంటికెళ్లారు. లైంగికదాడికి సంబంధించి కేసు విత్ డ్రా చేసుకోవాలని బెదిరించారు. అందుకు యువతి తల్లి నిరాకరించడంతో.. వారి ఇంట్లోనే చితక్కొట్టారు. ఒకడు అయితే తన కాలితో మహిళ మొహంపై తన్నాడు. మహిళతోపాటు కూతురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. అయితే శుక్రవారం సాయంత్రం బాధితురాలి తల్లి ఆస్పత్రిలో చనిపోయారు.
నేలకేసి పడేసి..
గత గురువారం ఇంటిలోకి వచ్చిన దుండగులు కేసు విత్ డ్రా గురించి వాదించారు. అందుకు అంగీకరించకపోవడంతో.. ఎర్ర కుర్తా వేసుకున్న మహిళను నేలపై పడేసి కొట్టారు. తెల్ల కుర్తా వేసుకున్న యువకుడు ఆమె మొహంపై తన కాలితో తన్నుతున్నట్టు కనిపించింది. మరో వీడియోలో కుటుంబసభ్యులు వారిని ఆస్పత్రికి తరలిస్తున్నట్టు కనిపించింది.

పరారీలో ముగ్గురు
మహిళపై దాడిచేసిన ముగ్గురిని అరెస్ట్ చేశామని కాన్పూర్ పోలీసులు తెలిపారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నామన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుందని, నిందితులను ఉపేక్షించబోమని కాన్పూర్ పోలీసులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications