ఢిల్లీకి వెళ్లే అన్ని రైళ్ల రద్దుపై సుప్రీంకోర్టులో పిటీషన్- వాదనలు
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా దేశ రాజధానిలో శనివారం భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టేందుకు వివిధ ప్రజాసంఘాలు సమాయత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ నగరవ్యాప్తంగా ప్రభుత్వం అత్యంత కఠినమైన భద్రతా ఆంక్షలు విధించింది. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ సుప్రీంకోర్టులో అత్యవసరంగా పిటీషన్ వేశారు.
ఈ పరిస్థితులను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. శాంతియుత నిరసనలను అణచివేసే చర్యల చట్టబద్ధతను ప్రశ్నించారు. కేంద్రం వ్యవహరిస్తోన్న తీరుపట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ పోలీసులు విధించిన ఈ ఆంక్షలన్నీ కూడా తొలగిపోయేలా, ప్రజాస్వామ్యబద్ధంగా ఆయా ప్రజా సంఘాల గొంతుకను వినిపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆ పిటీషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ బెంచ్ సమక్షానికి వచ్చింది. ఈ సందర్భంగా కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ తమ వాదనలను వినిపించారు. ఈ ఆంక్షలకు వ్యతిరేకంగా ఇప్పటికే న్యాయస్థానంలో ఒక పిటిషన్ దాఖలు చేశామని కపిల్ సిబల్ ధర్మాసనానికి వివరించారు. జూలై నెలలో సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలకు సంబంధించిన ఇతర పిటిషన్లతో కలిపి, దీన్ని కూడా అత్యవసరంగా విచారించాలని ఆయన కోరారు.
రాజధాని ప్రాంతంలో శాంతిభద్రతల నెపంతో ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని కపిల్ సిబల్ పేర్కొన్నారు. ఢిల్లీ నగర సరిహద్దుల్లోనూ, నగర పరిధిలోనూ విధించిన అసాధారణ పరిస్థితులను ఆయన ఈ సందర్భంగా ధర్మాసనం ముందు ఉంచారు. నిరసనల్లో పాల్గొనడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పౌరులను నిరోధించడానికే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందని ఆరోపించారు. ఢిల్లీ వైపు వచ్చే అన్ని రైళ్లను ఇప్పటికే రద్దు చేశారని, అన్ని మెట్రో స్టేషన్లను కూడా బంద్ చేస్తోన్నారని అన్నారు.
నిరసనకారులకు హోటళ్లు, ఇతర వసతి గృహాల్లో గదులు కేటాయించవద్దని యాజమాన్యాలను ఆదేశించినట్లు అని కపిల్ సిబల్ కోర్టుకు స్పష్టం చేశారు. ఈ నిర్బంధాల తీవ్రత చాలా అధికంగా ఉందని, దీనివల్ల ఢిల్లీ పౌరుల సాధారణ దైనందిన జీవితానికి తీవ్ర భంగం కలుగుతోందని చెప్పారు. హజ్రత్ నిజాముద్దీన్ ప్రాంతాన్ని దాదాపుగా మూసివేశారని, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు కూడా ప్రజలను ఇళ్లను వదిలి బయటకు రావద్దని ఆదేశిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని పేర్కొన్నారు.
అసలు ప్రజాస్వామ్య దేశంలో ఏం జరుగుతోందని, శాంతియుత మార్గంలో నిరసన తెలిపే హక్కును ఎలా కాలరాస్తారని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. ఈ వాదనలపై సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ కొన్ని కీలక వివరణలను ఇచ్చింది. ప్రతివాది లేకుండా వీటన్నింటినీ ఎత్తివేసేలా ఆదేశాలను నేరుగా జారీ చేయలేమని బెంచ్ పేర్కొంది. ఆ ఆంక్షల ఉత్తర్వులను కోర్టులో చట్టబద్ధంగా సవాలు చేస్తేనే ప్రస్తుత పరిమితులను సడలించే అంశాన్ని పరిశీలించగలమని స్పష్టం చేసింది.















Click it and Unblock the Notifications
