18 మంది ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు.. 6నెలల పాటు అసెంబ్లీకి నో ఎంట్రీ..!
కర్ణాటకలో హనీ ట్రాప్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. దేశవ్యాప్తంగా 48 మంది రాజకీయ నేతలు ఇందులో బాధితులుగా ఉన్నారంటూ ఇటీవల ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనానికి దారి తీశాయి. ఇదే విషయంపై నేడు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష బీజేపీ నేతలు లేవనెత్తడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేశారు. ఆరు నెలల పాటు వారిపై సస్పెన్షన్ విధిస్తూ తీర్మానం చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నందుకు, అధ్యక్ష స్థానాన్ని కించపరిచినందుకే వారిని సస్పెండ్ చేసినట్లు స్పీకర్ తెలిపారు. మరోవైపు సస్పెండైన ఎమ్మెల్యేలను మార్షల్స్ బలవంతంగా బయటకు తరలించారు.
ఇక ఇదే విషయంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు.తమ ప్రభుత్వానికి ఎవరినీ రక్షించే ఉద్దేశం లేదని, చట్టప్రకారం దోషులకు తప్పకుండా శిక్ష పడుతుందని స్పష్టం చేశారు. హనీ ట్రాప్ వ్యవహారంపై ఉన్నతస్థాయి కమిటీతో విచారణ జరిపిస్తామని హోంమంత్రి ఇప్పటికే హామీ ఇచ్చారనీ.. అయినా బీజేపీ నేతలు అసెంబ్లీలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏం జరిగింది..?
రాష్ట్రానికి చెందిన కనీసం 48 మంది రాజకీయ నేతలు హనీ ట్రాప్‌లో చిక్కుకుపోయారని కర్ణాటక సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. సీడీలు, పెన్‌డ్రైవ్‌లలో వారి అసభ్య వీడియోలు ఉన్నాయన్నారు. ఇది ఏ ఒక్క పార్టీకో పరిమితమైన విషయం కాదని.. అధికారపక్షం సహా విపక్షానికి చెందినవారు ఈ బాధితుల్లో ఉన్నారని అన్నారు.












Click it and Unblock the Notifications