అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న లీడర్స్ వీళ్లే, 100 మంది లిస్ట్ వైరల్, కౌరవులు జాబితా అంటూ ?
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న సమయంలో రాజకీయ పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ పార్టీల కార్యకర్తలను, ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్ పార్టీ మొదటి జాబితా విడుదల చేసి ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసింది. బీజేపీ మొదటి జాబితా అంటూ 100 పేర్లతో ఓ లిస్ట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో అది వైరల్ అయ్యింది.
సోషల్ మీడియాలో బీజేపీ అభ్యర్థుల జాబితాపై జోరుగా చర్చ మొదలైయ్యింది. ఈ దెబ్బతో బీజేపీ నాయకులకు మండిపోయింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ అరుణ్ సింగ్ బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడ్డారు. బీజేపీ ఇంత వరకు ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల చెయ్యలేదని, ఇది కాంగ్రెస్ పార్టీ ట్రిక్ అని అరుణ్ సింగ్ ఆరోపించారు.

ఇలాంటి నీచ రాజకీయాలు చెయ్యడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య, బీజేపీ నాయకుల జాబితా అంటూ కొన్ని పేర్లు సోషల్ మీడియాలో పోస్టు చేసి కార్యకర్తల్లో అలజడి రేపి వారిని అయోమయానికి గురి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు చోద్యం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీని ఎదుర్కోలేక మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తదితరులు ఇలాంటి చిల్లర గేమ్స్ ఆడుతున్నారని బీజేపీ నాయకులు మండిపడుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా 100 మందితో కూడిన నకిలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసి బీజేపీ నాయకులు, కార్యకర్తల మద్య అలజడి రేపిన కాంగ్రెస్ పార్టీ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు బెంగళూరులోని మల్లేశ్వరంలో కేసు పెట్టారు. నకిలి బీజేపీ జాబితా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కర్ణాటక ఐటీ, బీటీ శాఖల మంత్రి డాక్టర్ అశ్వథ్ నారాయణ, మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే సీటీ రవితో పాటు పలువురు బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియాలో వంద మంది బీజేపీ అభ్యర్థుల నకిలి జాబితాను చూసిన కొందరు కౌరవులా ? అంటూ ప్రశ్నిస్తున్నారని బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications