మారుతున్న రాజకీయాలు, ఏకం అవుతున్న ప్రతిపక్షాలు, మాజీ ప్రధానితో చర్చలు, అంతా ఓకే !
బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ లింగాయత్ సంఘం నేత బీఎస్ యడ్యూరప్ప కుమారుడు బీవై విజయేంద్రను రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ హైకమాండ్ నియమించింది. బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు బీవై విజయేంద్ర మంచి జోష్ మీద ఉన్నాడు.
సోమవారం బెంగళూరులోని పద్మనాభనగర్ లో నివాసం ఉంటున్న జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ ఇంటికి బీవై. విజయేంద్ర వెళ్లారు. మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడను సన్మానించిన విజయేంద్ర ఆయన అశీర్వాదం తీసుకున్నారు. విజయేంద్ర వెంట మాజీ ప్రధాని దేవేగౌడ మనుమడు, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కూడా ఉన్నారు.

బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా నియమించిన తరువాత బీవై. విజయేంద్ర మాజీ ప్రధాని దేవెగౌడతో సమావేశం అయ్యి భవిష్యత్తు కర్ణాటక రాజకీయాల గురించి, వచ్చే లోక్‌సభ ఎన్నికల గురించి చర్చించినట్లు సమాచారం. బెంగళూరులోని ఆర్‌టీ నగర్‌లో నివాసం ఉంటున్న ఉన్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ ఇంటికి వెళ్లిన విజయేంద్ర ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు.
బసవరాజ్ బోమ్మయ్ ని పరామర్శించిన విజయేంద్ర ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. ఈ సందర్బంగా విజయేంద్ర మీడియాతో మాట్లాడుతూ దీపావళి శుభ సందర్భంగా మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ ని కలుసుకుని ఆయన ఆశీస్సులు అందుకున్నానని, ఆయన సూచనల మేరకు నడుచుకోవాలని భావిస్తున్నానని అన్నారు.
మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నారని విజయేంద్ర అన్నారు. బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర నియమించి బీజేపీ హైకమాండ్ మంచి నిర్ణయం తీసుకుందని, కర్ణాటకలో బీజేపీ ఇంకా బలపడటానికి అవకాశం ఉందని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. ఇదే సందర్బంలో బీజేపీ పెద్దలను బీవై విజయంద్ర కలుసుకుని వారి ఆశీర్వాదం, వారి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications