Milk Price: పొంగిన పాల ధరలు.. లీటరుపై ఏకంగా 8 రూపాయలు పెంపు
సామాన్యుడి జేబుకు మరోసారి పెద్ద చిల్లు పడబోతోంది. నిత్యం ఉదయాన్నే ఇళ్లలోకి వచ్చే పాల ప్యాకెట్ ధర మళ్లీ భగ్గుమనుంది. కర్ణాటక వ్యాప్తంగా ఎంతో ప్రజాదరణ పొందిన 'నందిని' పాల ధరలను లీటరుపై ఏకంగా రూ. 8 వరకు పెంచేందుకు రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం శాసన మండలి ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకుండా పక్కన పెట్టారు.
ఎన్నికల సంఘం అనుమతి లభించిన వెంటనే, వచ్చే నెల అంటే నవంబర్ 1 నుంచి కొత్త ధరలు అమలులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై తుది నిర్ణయం తీసుకునే బాధ్యతను ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు క్యాబినెట్ అప్పగించింది.

రైతులకు ఊరట.. వినియోగదారులకు భారం!
తాజాగా ప్రతిపాదించిన రూ.8 పెంపులో ఎక్కువ భాగం పాడి రైతులకే చెందనుంది. పెరిగే రూ.8 లో రూ. 6 నేరుగా రైతులకు చేరనుండగా, మిగిలిన రూ. 2 ను పాల యూనియన్లు తీసుకోనున్నాయి. ఈ నిర్ణయంతో ఇప్పటివరకు లీటరు రూ. 46 కి లభిస్తున్న బ్లూ కలర్ ప్యాకెట్ (టోన్డ్ మిల్క్) ధర ఒక్కసారిగా రూ. 54 కి చేరనుంది. కాగా, ఈ పెంపును సమర్థించుకున్న ప్రభుత్వం.. తీవ్రమైన కరువు, పశువుల మేత కొరత, రవాణా చార్జీలు, ప్యాకేజింగ్ ఖర్చులు పెరిగిపోవడంతో రైతులను ఆదుకునేందుకే ఈ నిర్ణయం తప్పలేదని పేర్కొంది. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడులో కొనుగోలు ధరలు రూ. 41 కంటే ఎక్కువగా ఉండగా, కర్ణాటకలో మాత్రం రూ. 35 మాత్రమే ఇస్తున్నారని, అందుకే పెంచాల్సి వస్తోందని పాల యూనియన్లు చెబుతున్నాయి.
మూడేళ్లలో ఇది ఐదోసారి!
గడిచిన మూడేళ్ల కాలాన్ని పరిశీలిస్తే నందిని పాల ధరలు పెరగడం ఇది వరుసగా ఐదోసారి. 2022 నవంబర్‌లో రూ. 3, 2023 జూలైలో రూ. 3, 2024 జూన్‌లో రూ. 2 (ఆ సమయంలో 50 ఎంఎల్ అదనంగా ఇచ్చి తర్వాత ఉపసంహరించుకున్నారు), అలాగే 2025 మార్చిలో రూ. 4 చొప్పున పెంచారు. ఇప్పుడు ఏకంగా రూ. 8 పెంచేందుకు సిద్ధమవ్వడంతో మళ్లీ సామాన్య కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడనుంది.
జనవరిలో స్థానిక పోరు.. బెంగళూరుకు 5 పోలీస్ కమిషనరేట్లు
పాల ధరల పెంపుతో పాటు క్యాబినెట్ సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో జిల్లా పంచాయితీ, తాలూకా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. వీటి తర్వాతే గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్లనున్నారు. అలాగే గ్రేటర్ బెంగళూరు పరిధిని పాలనా సౌలభ్యం కోసం ఐదు పోలీస్ కమిషనరేట్లుగా (బెంగళూరు సెంట్రల్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్) విభజించే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.














Click it and Unblock the Notifications
