సీఎం మెడకు ముడా: అత్యవసర కేబినెట్ భేటీ: డిప్యూటీ సీఎంకు పగ్గాలు?
Siddaramaiah: కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చిక్కుల్లో చిక్కుకున్నారు. న్యాయపరమైన విచారణను ఎదుర్కొనాల్సిన పరిస్థితిలో పడ్డారు.
మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA)లో చోటు చేసుకున్నట్లుగా భావిస్తోన్న భారీ కుంభకోణం దీనికి ప్రధాన కారణమైంది. ఈ కుంభకోణంలో సిద్ధరామయ్యను విచారించడానికి కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్.. గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రాజకీయంగా తీవ్ర కలకలం రేపినట్టయింది.

కొద్దిరోజులుగా ముడా కుంభకోణం.. కర్ణాటకలో రోజూ వార్తల్లో ఉంటూ వస్తోంది. ఇందులో సిద్ధరామయ్య ప్రమేయం ఉందని, ఆయనకు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతూ వస్తోన్నాయి. ఈ అంశంపై గతంలో ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ- జనతాదళ్ (సెక్యులర్) నాయకులు పలుమార్లు ఆందోళనలు సైతం చేపట్టారు.
ఈ వ్యవహారంలో సిద్ధరామయ్యను విచారించాల్సిన అవసరం ఉందనే డిమాండ్ వినిపించింది. దీనికి అనుగుణంగా- టీజే అబ్రహం, ప్రదీప్, స్నేహమయి కృష్ణ.. రాజ్‌భవన్‌ను ఆశ్రయించారు. సిద్ధరామయ్యను విచారించడానికి అనుమతులు ఇవ్వాలంటూ దరఖాస్తును దాఖలు చేసుకున్నారు. ముడా స్కాంకు సంబంధించిన్న కొన్ని కీలక డాక్యుమెంట్లను వాటికి జత చేశారు.
దీనిపై జులై 26వ తేదీన గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్.. సిద్ధరామయ్యకు షోకాజ్ నోటీసును జారీ చేశారు. దీనికి వారం రోజుల్లోగా సంతృప్తికరమైన వివరణలు, సమాధానాలను ఇవ్వాలంటటూ ఆదేశించారు. దీన్ని తప్పు పట్టింది కర్ణాటక ప్రభుత్వం. దీనికి స్పందించాల్సిన అవసరం లేదంటూ ఆగస్టు 1వ తేదీన ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇప్పుడు తాజాగా- సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ ఆదేశించడం దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో- అత్యవసర మంత్రివర్గ సమావేశానికి పిలుపునిచ్చారు సిద్ధరామయ్య. ఈ సాయంత్రం విధానసౌధ సచివాలయంలో ఈ భేటీ ఏర్పాటు కానుంది. అందుబాటులో ఉన్న మంత్రులు ఈ భేటీకి హాజరు కానున్నారు.
గవర్నర్ తాజాగా ఇచ్చిన అనుమతులను న్యాయస్థానాల్లో ఎలా పోరాడాలనే విషయంపై ఇందులో చర్చిస్తారని తెలుస్తోంది. న్యాయ విచారణను తప్పనిసరిగా ఎదుర్కొనాల్సిన పరిస్థితే ఎదురైతే సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయొచ్చనే ప్రచారం జరుగుతోంది. అది వాస్తవరూపం దాల్చితే ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్.. ముఖ్యమంత్రి పగ్గాలను అందుకుంటారనే వాదనలు లేకపోలేదు.












Click it and Unblock the Notifications