సిద్ధరామయ్య కీలక ఉత్తర్వులు- వివాదాస్పదం: బీజేపీ ఆందోళన
బెంగళూరు: కర్ణాటకలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వివాదాస్పద నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇది కాస్త రాజకీయ రంగు పులుముకొంది. ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ విమర్శల దాడి సైతం మొదలు పెట్టింది. తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకూ సిద్ధరామయ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామంటూ హెచ్చరించింది కూడా.
గత ఏడాది జులైలో దక్షిణ కన్నడ జిల్లాలోని సుళ్య తాలుకా బెళ్లారపేటెలో దారుణహత్యకు గురైన భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నాయకుడు ప్రవీణ్ నెట్టారు భార్య నూతన్ కుమారిక బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం ఉద్యోగాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే. బెంగళూరులో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆమెకు గ్రూప్ సీ హోదాతో ఉద్యోగాన్ని కల్పించింది బొమ్మై ప్రభుత్వం. ఇది కాంట్రాక్ట్ ప్రాతిపదికన కల్పించిన ఉద్యోగం.

ఈ ఉద్యోగాన్ని రద్దు చేసింది సిద్ధరామయ్య సర్కార్. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదొక్కటే కాదు- బొమ్మై ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న కొన్ని కీలకమైన కాంట్రాక్ట్ ఉద్యోగాలను తొలగించింది. కర్ణాటకలో ఇకపై కాషాయీకరణ ఉండబోదని, మోరల్ పోలిసింగ్ వ్యవస్థను కూడా రద్దు చేస్తున్నామంటూ ఇదివరకే సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా- బొమ్మై ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని కీలక శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాలను తొలగించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఈ క్రమంలో ప్రవీణ్ నెట్టారు భార్య నూతన్ కుమారి కూడా ఉద్యోగాన్ని కోల్పోయారు. ఇది కాస్తా రాజకీయ రంగును పులుముకొంది. నూతన్ కుమారిని ప్రభుత్వం అన్యాయం చేసిందని, ఆమెను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తోంది.
పీఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందంటూ ధ్వజమెత్తింది. ప్రవీణ్ నెట్టారును హత్య చేసిన పీఎఫ్ఐ కార్యకర్తల ఒత్తిడితోనే సిద్ధరామయ్య ఈ నిర్ణయాన్ని తీసుకున్నారంటూ ఆరోపిస్తోంది. దక్షిణ కన్నడ జిల్లాలోని సుళ్య తాలుకా బెళ్లారపేటెకు చెందిన ప్రవీణ్ నెట్టారు గత ఏడాది హత్యకు గురయ్యారు. స్థానికంగా పౌల్ట్రీ షాప్‌ను నిర్వహిస్తోన్న ఆయనను బైక్‌పై వెంటాడి మరీ నరికి చంపారు. అప్పట్లో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.












Click it and Unblock the Notifications