స్టార్ హీరోకు బంపర్ ఆఫర్, రాజకీయాల్లో రావాలని డీసీఎం ఆశ, హీరో ఏం చెప్పారంటే, ఆ పేరు ఎవరిది !
బెంగళూరులో జరిగిన ఈడిగ కులస్తుల భారీ సమావేశంలో కన్నడ కంఠీరవుడు డాక్టర్ రాజ్ కుమార్ కుటుంబంలోని పెద్ద కుమారుడు, హ్యాట్రిక్ హీరో శివరాజ్ కుమార్‌ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆహ్వానించారు. ఇదే వేదిక మీద ప్రముఖ కన్నడ నటుడు డాక్టర్ శివరాజ్ కుమార్ ఆసక్తికర సమాదానం ఇవ్వడం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.
ప్రముఖ కన్నడ నటుడు, హ్యాట్రిక్ హీరో డాక్టర్ శివరాజ్ కుమార్ డీకే శివకుమార్ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పిన శివరాజ్ కుమార్ వేరొకరి పేరును సూచించారు. హీరో శివరాజ్‌కుమార్ కోరుకుంటే ఎంపీ టిక్కెట్ ఇస్తానని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈడిగ కులస్తుల సమావేశంలో బహిరంగంగా చెప్పారు. దీనిపై వేదికపై ఉన్న శివరాజ్ కుమార్ స్పందించారు.

ముఖానికి రంగులు వేసుకుని ఎలా నటించాలో మా నాన్నగారు రాజ్ కుమార్ మాకు చెప్పారు. ఓపిక ఉన్నంతకాలం తాను నటిస్తూనే ఉంటానని శివరాజ్ కుమార్ స్పష్టం చేశాడు. తాను రాజకీయాల్లోకి రానని మా నాన్న రాజ్ కుమార్ చూపించిన దారిలోనే తాను వెలుతానని శివరాజ్ కుమార్ చెప్పారు. ఈ జన్మకు తనకు నటన చాలు, నాకు రాజకీయాలు వద్దు అని శివరాజ్ కుమార్ బహిరంగంగానే చెప్పారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కూతురు మా ఇంటి కోడలు అయ్యింది, బంగారప్ప కుమార్తె గీతాను తాను వివాహం చేసుకుని చాలా సంతోషంగా ఉన్నానని, రాజకీయాల్లోకి రావాలని తన భార్య గీతా తనను ఎప్పుడూ అడగలేదని, తన భార్య గీతా ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నారని, ఆమె లోక్ సభ ఎన్నికల్లో నిలబడాలనుకుంటే నేను మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని హీరో శివరాజ్ కుమార్ చెప్పారు.
తన కంటే తన భార్య గీతా రాజకీయాల్లో చురుకుగా ఉన్నారని, ఆమె ప్రజలకు సేవ చేస్తానంటే తాను ఆమెకు అండగా ఉంటానని, ఆమె వెనుక తాను నిలబడుతాను అని శివరాజ్ కుమార్ అన్నారు. నేను పుట్టకముందే ఈడిగ సంఘం స్థాపించబడిందని, ఈరోజు పెద్దపెద్ద సభలు, సమావేశాలు జరుగుతున్నాయని, ఈడగ కులానికి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలకైన తన మద్దతు ఉంటుందని శివరాజ్ కుమార్ అన్నారు.

ఈడిగ సమాజం కోసం జరగే కార్యక్రమాలలో విభేదాలు లేకుండా చూసుకోవాలని, ఎవరు ఎలా చేస్తారు అనే దానికంటే ఎవరి కోసం చేశామన్నదే ముఖ్యం అని శివరాజ్ కుమార్ అన్నారు. ఈడిగ. సంఘం తరపున సంఘం నాయకులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు విజ్ఞప్తి చేశారు. మా డిమాండ్లను ముఖ్యమంత్రి సిద్దరామయ్య నెరవేరుస్తారనే నమ్మకం ఉందని నటుడు శివరాజ్ కుమార్ అన్నారు.
ఇదే సంవత్సరంలో జరిగిన కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌లో ఉన్న తన భార్య గీతా కోసం చామరాజనగర్, శివమొగ్గ జిల్లాలతో సహా పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ తరపున శివరాజ్ కుమార్ ప్రచారం చేశారు. అప్పుడు కూడా భార్య గీతాకు వెన్నుదన్నుగా నిలుస్తానని హీరో శివరాజ్ కుమార్ బహిరంగంగా చెప్పారు. అయితే శివరాజ్ కుమార్ భార్య గీతా శివరాజ్ కుమార్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని తెలిసింది.
డాక్టర్ రాజ్ కుటుంబ సభ్యులను ఏదో ఒక సందర్భంలో రాజకీయాల్లోకి రావాలంటూ పలు రాజకీయ పార్టీల నాయకులు ఆహ్వానం పలుకుతున్నారు. కానీ అప్పుడు డాక్టర్ రాజ్ కుమార్, ఇప్పుడు ఆయన పిల్లలు రాజకీయాల్లోకి రామని చెప్పారు. ఇప్పుడు శివరాజ్ కుమార్ ఇదే మాట స్పష్టం చేశారు. మొత్తం మీద శివరాజ్ కుమార్ రాజకీయాల్లోకి రాకపోయినా ఆయన భార్య గీతా శివరాజ్ కుమార్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి లైన్ క్లియర్ అవుతోందని తెలిసింది.












Click it and Unblock the Notifications