నేను నమ్మిన వాళ్లే ముంచేశారు, మట్టిని అమ్మి పైకి వచ్చాను, జోబులు కొట్టి కాదు, రెడ్డి ఫైర్ !
బెంగళూరు/బళ్లారి: తన వెంట ఎంతో నమ్మకంగా ఉన్నట్లు నటించి తనకు అండగా ఉంటామని మాయమాటలు చెప్పి తనను నిలువునా మోసం చేశారని కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ఎన్ని చేసినా తనను ప్రజలకు దూరం చెయ్యలేరని, తాను ప్రజాజీవితంలో ఉంటానని గాలి జనార్దన్ రెడ్డి అంటున్నారు.
తన గురించి తన వెంట చాలా కాలం ఉన్న కొందరు రాజకీయ నాయకులు తరువాత తన మీద కక్ష పెంచుకున్నారని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. తాను జైలుకు వెళ్లిన తరువాత బీజేపీ హైకమాండ్ తో పాటు కర్ణాటకకు చెందిన కొందరు నాయకుల దగ్గర తన మీద చెడుగా చెప్పారని, తన గురించి తప్పుడు ప్రచారం చేశారని మాజీ మంత్రి గాలి జనార్దర్ రెడ్డి ఆరోపించారు.
కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ తనను రాజకీయాల్లోకి రావాలని ఒత్తిడి చేస్తే తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి తీసుకురావడానికి నువ్వు చాలా కష్టపడ్డావు రెడ్డి అని సుష్మాస్వరాజ్ చెప్పిన మాటలు తనకు ఇంకా గుర్తు ఉన్నాయని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.

ఎవరు ఎన్ని మోసాలు, ద్రోహాలు చేసినా కాలమే అన్నింటికి సమాధానం చెబుతుందని, అంత వరకు అందరూ వేచి చూడాలని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. జైలు నుంచి తాను విడుదలైన తరువాత నీళ్లలో చేపలు ఎలా ఉంటాయో, అవి బయటకు రాలేక ఎలా ఇబ్బంది పడుతాయో అలాగే తాను రెండు సంవత్సరాలు నానా ఇబ్బందులు పడ్డానని, ఇప్పుడు బయటకు వచ్చేశానని గాలి జనార్దన్ రెడ్డి అంటున్నారు.
తాను మట్టి అమ్ముకుని శ్రీమంతుడు అయ్యానని, ఎవ్వరి జోబులు కొట్టి కోటీశ్వరుడు కాలేదని గాలి జనార్దన్ రెడ్డి అంటున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కేఆర్ పీ పార్టీ అభ్యర్థులు అందరిని గెలిపించుకోవడానికి తాను శక్తి వంచన లేకుండా పని చేస్తున్నానని, కార్యకర్తల కూడా అలాగే పని చేస్తున్నారని, కచ్చితంగా మా సత్తా నిరూపించుకుంటామని మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications