కర్నాటకలో సీబీఐ ఎంట్రీకి బ్రేక్-సిద్ధరామయ్య అరెస్టు భయాలతో ?
కర్నాటకలో సీబీఐ ఎంట్రీని నిషేధిస్తూ సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలో కేసుల దర్యాప్తు కోసం ఇప్పటికే ఢిల్లీ పోలీసు చట్టం ప్రకారం సీబీఐకి ఉన్న అనుమతిని ఉపసంహరిస్తూ ఆదేశాలు ఇస్తున్నట్లు కర్నాటక ప్రభుత్వం ప్రకటించింది. సీఎం సిద్ధరామయ్యను ముడా భూముల కుంభకోణంలో అరెస్టు చేస్తారనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సీబీఐ పక్షపాత చర్యల నేపథ్యంలో గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకున్నట్లు కర్నాటక న్యాయశాఖ మంత్రి హెచ్ కే పాటిల్ వెల్లడించారు. బీజేపీ చెప్పుచేతల్లో పనిచేస్తున్న సీబీఐ పక్షపాత ధోరణి కారణంగానే ఆ సంస్థ దర్యాప్తులపై ఉన్న అనుమతిని వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. సీఎం సిద్ధరామయ్య నిందితుడిగా ఉన్న ముడా భూముల కేసులో ఆయన్ను అరెస్టు చేస్తారనే భయాలు ఇందుకు కారణం కాదని న్యాయమంత్రి తెలిపారు.

సీబీఐకి తాము గతంలో ఎన్నో కేసులు అప్పగించి దర్యాప్తు చేయించామని, కానీ ఛార్జిషీట్లు మాత్రం వేయడం లేదనే విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇప్పటికే తాము ఎన్నో కేసులు సీబీఐకి ఇచ్చామని, కానీ వాటిలో దర్యాప్తులు సైతం ముందుకు సాగడం లేదని ఇలాంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయని మంత్రి హెచ్ కే పాటిల్ తెలిపారు. కాబట్టి ఇకపై ఇలాంటి పక్షపాత చర్యలకు పాల్పడకుండా సీబీఐకి అడ్డుకట్ట వేయడమే తమ నిర్ణయం వెనుక కారణమని పేర్కొన్నారు. ఇప్పటికే విపక్షాలు అధికారంలో ఉన్న పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో సీబీఐ ప్రవేశంపై నిషేధం అమల్లో ఉంది.












Click it and Unblock the Notifications