మహిళలకు అద్దిరిపోయే గిఫ్ట్- బస్సుల్లో ఫ్రీ ట్రావెల్..!!
అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మహిళలకు కర్ణాటక ప్రభుత్వం గిఫ్ట్ ప్రకటించింది. బెంగళూరు సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించింది.
బెంగళూరు: పొరుగునే ఉన్న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార వేడి పతాక స్థాయికి చేరకుంటోంది. ఈ నెలాఖరులోగా అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో- ప్రధాన పార్టీలన్నీ తమ ప్రచార కార్యక్రమాలకు మరింత పదును పెడుతున్నాయి. అధికార భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్).. ఇప్పటికే జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టాయి. ఆయా పార్టీల సీనియర్ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నారు.

ముమ్మర ప్రచారం..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే కర్ణాటకకు వచ్చిన విషయం తెలిసిందే. శివమొగ్గలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయాన్ని ఆయన ప్రారంభించారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున ఖర్గె సొంతం రాష్ట్రం కావడం వల్ల.. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందా పార్టీ.

మేనిఫెస్టోలపై..
ఒకవంక ప్రచార కార్యక్రమాలన్నింటినీ ముమ్మరంగా కొనసాగిస్తూనే మరోవంక చేరికలకూ గేట్లు ఎత్తేశాయి. బీజేపీ నాయకులు కాంగ్రెస్ లో, కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు బీజేపీలో చేరుతున్నారు. అదే క్రమంలో ఇక మేనిఫోస్టోలపైనా దృష్టి సారించాయి. దీనికోసం ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేశాయి. కాంగ్రెస్ ఇప్పటికే కొన్ని కీలక హామీలను ఇచ్చింది.

హామీల జోరు..
తాము అధికారంలోకి వస్తే- మహిళకూ ప్రతినెలా 2,000 రూపాయల నగదును ఇస్తామని ప్రకటించింది. వంటగ్యాస్ సిలిండర్ ను 500 రూపాయలకే పంపిణీ చేస్తామనీ తెలిపింది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను సరఫరా చేస్తామని కూడా ప్రకటించింది కాంగ్రెస్. వరుసగా రెండోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ ముమ్మరంగా కసరత్తు మొదలు పెట్టింది. దీనికోసం అందుబాటులో ఉన్న వనరులన్నింటినీ వినియోగించుకుంటోంది.

బీఎంటీసీ బస్సుల్లో..
గతంలో ఎప్పుడూ లేనవిధంగా మహిళలకు అద్దిరిపోయే బహుమానాన్ని ప్రకటించింది ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నాడు బెంగళూరు పరిధిలోని సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించింది. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సులన్నింట్లోనూ ఇది వర్తింపజేసింది. ఈ మేరకు బీఎంటీసీ కొద్దిసేపటి కిందటే ఉత్తర్వులను జారీ చేసింది.

విమెన్స్ డే నాడు..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మహిళలందరికీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించాలని సూచిస్తూ ఇదివరకే కర్ణాటక రవాణా శాఖ అండర్ సెక్రెటరీ పుష్పా వీఎస్.. బీఎంటీసీకి లేఖ రాశారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా బీఎంటీసీ మేనేజింగ్ డైరెక్టర్ సత్యవతి కొద్దిసేపటి కిందటే ఉత్తర్వులు జారీ చేశారు.

10 లక్షలమందికి పైగా..
ప్రతిరోజూ 10.21 లక్షల మంది మహిళా ప్రయాణికులు బీఎంటీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తుంటారు. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వారందరికీ లబ్ది కలుగుతుంది. బీఎంటీసీ పరిధిలో మొత్తం 6,600 సిటీ బస్సులు ఉన్నాయి. రోజూ 10.84 లక్షల కిలోమీటర్ల మేర రాకపోకలు సాగిస్తుంటాయి. సగటున ప్రతిరోజూ 29 లక్షల మంది ప్రయాణికులు సిటీ బస్సు సేవలను వినియోగించుకుంటుంటారు.












Click it and Unblock the Notifications