బెంగళూరు రేప్: గ్యాంగ్‌రేప్ వ్యాఖ్యపై మంత్రి యూటర్న్
బెంగళూరు: ఒక మహిళ పైన ఇద్దరు మగవాళ్లు అత్యాచారానికి పాల్పడితే దానిని సామూహిక అత్యాచారం అనలేమనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేసిన కర్ణాటక హోంమంత్రి కేజే జార్జ్... తాను చేసిన వ్యాఖ్యల పైన ఆ తర్వాత వివరణ ఇచ్చారు.
ఇటీవల బెంగళూరులో కాల్ సెంటర్ ఉద్యోగిని గ్యాంగ్ రేప్ పైన స్పందిస్తూ బుధవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సామూహిక అత్యాచారానికి మంత్రి కొత్త నిర్వచనం చెబుతున్నారంటూ ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
దీంతో శుక్రవారం జార్జ్ తనవ్యాఖ్యలపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఒకరికంటే ఎక్కువమంది అత్యాచారానికి పాల్పడితే భారత శిక్షా స్మృతి సెక్షన్ 376(డి) కింద కేసు నమోదవుతుందని మాత్రమే తానన్నానని చెప్పారు.

నలుగురైదుగురు కలిసి చేసిన అకృత్యాన్నే గ్యాంగ్ రేప్ అంటారని వ్యాఖ్యానించానన్నారు. ఈ కేసులో యువతిపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారని, ఒక మహిళను పలువురు కలిసి బహిరంగంగా అత్యాచారం చేస్తే, దానిని సామూహిక అత్యాచారంగా ప్రజలు భావిస్తున్నారని, తాను అదే అన్నానని వివరించారు.
ఈ ఘటనలో సామూహిక అత్యాచారంగానే పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యల అంశాన్ని జాతీయ మహిళా కమిషన్ తనంతట తానుగా విచారణకు చేపట్టింది. తక్షణం వివరణ ఇవ్వాలంటూ ఆయనకు నోటీసులు పంపించింది.












Click it and Unblock the Notifications