బిగ్ షాక్ ; అనారోగ్యం కారణంగా మంత్రి మృతి..
కర్ణాటక ప్రణాళిక, గణాంకాల శాఖ మంత్రి డి. సుధాకర్ (66) కన్నుమూశారు. గత నెల రోజులుగా బెంగళూరులోని కిమ్స్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన, ఆదివారం తెల్లవారుజామున 3:15 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సుధాకర్, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు అత్యంత సన్నిహితుడు.
కొద్దికాలం క్రితం మోకాలి శస్త్రచికిత్స కోసం మణిపాల్ ఆస్పత్రిలో చేరిన సుధాకర్‌కు, అనంతరం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఏప్రిల్ 20న ఆయనను కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి లైఫ్ సపోర్ట్‌పై ఉన్న ఆయన, ఊపిరితిత్తుల మార్పిడికి వైద్యులు సన్నాహాలు చేస్తుండగానే మరణించడం విషాదకరం.

కాగా చిత్రదుర్గ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా సుధాకర్ సేవలందించారు. డీకే శివకుమార్‌ను రాజకీయ గురువుగా భావించిన ఆయన, శివకుమార్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. సుధాకర్ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2008లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరి, హిరియూరు నియోజకవర్గం నుంచి 2013, 2023లలో విజయం సాధించారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
మంత్రి సుధాకర్ మృతి పట్ల డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "నా సన్నిహితుడు, మంత్రివర్గ సహచరుడు సుధాకర్ మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది" అని ఆయన పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి, కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు. ప్రతిపక్ష నేత ఆర్. అశోక కూడా సంతాపం తెలిపారు.












Click it and Unblock the Notifications