ఉప ఎన్నికలు బహిష్కరిస్తామని సీఎంకు లేఖ రాసిన పోలీసులు, తలనొప్పి, రైట్ టైంలో ఝలక్!
బెంగళూరు: మా సమస్యలు పరిష్కరించకుంటే త్వరలో జరుగనున్న ఉప ఎన్నికలను బహిష్కరిస్తామని పోలీసులు పరోక్షంగా ఒత్తిడి చేస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు లేఖ రాయడంతో కలకలం రేపింది. పోలీసులు ఏకంగా సీఎం యడియూరప్ప, హోం మంత్రి బసవరాజ్ బోమ్మయ్ కు లేఖ రాయడంతో బీజేపీ వర్గాలు ఉలిక్కిపడ్డాయి.
వేతనాల తారతమ్యం విషయం వెంటనే పరిష్కరించాలని పోలీసులు సీఎం యడియూరప్ప మీద ఒత్తిడి తీసుకొచ్చారు. రాఘవేంద్ర ఔరాద్కర్ నివేదికలోని లోటుపాట్లను పరిశీలించి వెంటనే మా సమస్యలు పరిష్కరించాలని సీఎం యడియూరప్ప, హోం మంత్రి బసవరాజ్ బోమ్మయ్ కు పోలీసులు మనవి చేశారు.

తమ సమస్యలు పరిష్కరించకపోతే డిసెంబర్ 5వ తేదీ జరగనున్న ఉప ఎన్నికల్లో తాము ఓటు వెయ్యమని పోలీసులు అంటున్నారు. అయితే ఉప ఎన్నికల భద్రతా ఏర్పాట్లలో తాము పాల్గొనమని పోలీసులు చెప్పకపోయినా ఆ రోజు వాళ్లు ఏం చేస్తారు ? మనం ఇప్పుడు ఏం చెయ్యాలి ? అనే విషయంపై సీఎం యడియూరప్ప, హోం మంత్రి బసవరాజ్ బోమ్మయ్ అధికారులతో చర్చిస్తున్నారు.
పోలీసు అధికారులు, పోలీసులను చర్చలకు పిలవాలని సీఎం యడియూరప్ప ఆలోచిస్తున్నారని తెలిసింది. రాఘవేంద్ర ఔరాద్కర్ నివేదిక పరిశీలించి మా సమస్యలు పరిష్కారించాలని, వేతాల తారతమ్యం సమస్యతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నాలుగవ శనివారం ఇస్తున్న సెలవును పోలీసులకు ఇవ్వాలని, ప్రస్తుతం ఉన్న 10 సెలవు దినాలను 15 సెలవు దినాలుగా ప్రకటించాలని పోలీసులు సీఎం యడియూరప్పకు మనవి చేశారు. మొత్తం మీద కర్ణాటకలో ఉప ఎన్నికల వేడితో సతమతం అవుతున్న సీఎం యడియూరప్పకు పోలీసులు ఇప్పుడు మరో తలనొప్పిగా తయారైనారు.












Click it and Unblock the Notifications