యువతిపై ఆరుగురు సామూహిక అత్యాచారం.. వారిలో పోలీసులు కూడా..!
సమాజంలో రోజురోజుకూ మహిళలపై దారుణాలు పెరిగిపోతూనే ఉన్నాయి. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా కొన్ని మానవ మృగాలు ప్రవర్తిస్తున్నాయి. ఆడపిల్ల అయితే చాలు అని మృగాళ్లలా మీదపడిపోతున్నారు. వావి వరసలు కూడా మరచి అత్యాచారాలకు తెగబడుతున్నారు. తమ కామ వాంఛతో ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. ఆడవాళ్లు అర్ధరాత్రే కాదు.. పట్టపగలు ఒంటరిగా బయటకు రావాలన్నా భయపడి పోతున్నారు. ప్రభుత్వాలు పోక్సో, నిర్భయ, దిశ లాంటి ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. కఠినంగా శిక్షలు విధించినా ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. తాజాగా కర్ణాటకలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఓ 22 ఏళ్ల యువతిపై ఆరుగురు దుర్మార్గులు అత్యంత కిరాతకంగా గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. వారిలో రైల్వే పోలీసులు కూడా ఉన్నారని సమాచారం. యువతిని ఒకే చోట కాకుండా లాడ్జిలు, హోటల్స్ కు తిప్పుకుంటూ మరీ ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఏం జరిగిందంటే..?
ఓ యువతి కుటుంబ కలహాలతో మనస్తాపం చెందింది. అలా ఇంట్లో నుంచి బయటకు వచ్చి బెంగళూరు నుంచి రైలులో ప్రయాణించి యాదగిరికి చేరుకుంది. అక్కడ స్టేషన్ లో ఒంటరిగా కూర్చొన్న యువతి వద్దకు మల్లప్ప అనే వ్యక్తి వచ్చి ఆమె వివరాలు తెలుసుకుని సహాయం చేస్తానని నమ్మించాడు. అలా రైల్వే స్టేషన్ లోని ఓ ఇంటి సమీపంలోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఇద్దరు రైల్వే పోలీసులు ఆమెను బెదిరించి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డారు.

ఇక ఆ తర్వాత కొద్ది రోజుల పాటు మహేష్, ఆకాశ్, హర్ష తదితరులు వేర్వేరు ప్రదేశాలు ఆ యువతిని మారుస్తూ బెదిరింపులకు గురి చేస్తూ లైంగికంగా వేధించసాగారు. చివరికి బాధితురాలు ఆలంద్ నుంచి షాహాపుర్ వెళ్లేందుకు బస్సు ఎక్కింది. బస్సులో ఒంటరిగా కూర్చుని రోదిస్తుండగా అది గమనించిన తోటి ప్రయాణికులు ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ ద్వారా 112 కు సమాచారం అందించాడు. దాంతో రంగంలోకి దిగిన ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిబ్బంది బస్సును అడ్డగించి యువతిని ఎట్టకేలకు రక్షించారు. ఆ తర్వాత యాదగిరిలోని శక్తి సదన్ అనే ప్రభుత్వ మహిళా ఆశ్రమానికి తరలించారు. అక్కడే యువతికి వైద్య చికిత్స అందించారు. ఆ తర్వాత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే నిందితుల్ని అరెస్ట్ చేస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications
