కేసీఆర్ కు ముందుగానే తెలిసి కర్ణాటకకు దూరంగా ఉన్నారా ?, అంచనా !
హైదరాబాద్/బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో దేశం మొత్తం కర్ణాటక వైపు చూసింది. ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అని తేడాలేకుండా దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఇప్పుడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల గురించి చర్చించుకుంటున్నారు. కర్ణాటకలో ఎవ్వరి మద్దతు లేకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి సిద్దం అయ్యింది.
కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తరువాత దేశంలోని పలు పార్టీల నాయకులను హైదరాబాద్ కు ఆహ్వానించి జాతీయ రాజకీయాలపై చర్చలు జరిపారు. ఎక్కువగా కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ దళపతి హెచ్.డీ. కుమారస్వామిని హైదరాబాద్ పిలిపించుకుని ఆయనతో చర్చలు జరిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ పార్టీకి తమ మద్దతు ప్రకటిస్తామని కేసీఆర్ అప్పట్లో చెప్పారు.

కర్ణాటకలో తెలుగు వాళ్లు ఎక్కువగా ఉన్న అసెంబ్లీ నియోజక వర్గాల్లో జేడీఎస్ పార్టీకి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎన్నికల ప్రచారం చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. తెలుగువాళ్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో హెచ్ డీ. కుమారస్వామి పంచరత్న రథయాత్ర చేస్తున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఎవ్వరూరాలేదు.
చివరికి ఏక్ నిరంజన్ అంటూ మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 37 సీట్లు సొంతం చేసుకున్న హెచ్ డీ. కుమారస్వామి అప్పట్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకుని సీఎం అయ్యారు. తరువాత బీజేపీ ఆపరేషన్ కమలాను తెరమీదకు తెచ్చి హెచ్ డీ. కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చేసింది.
2018తో పోల్చుకుంటే సగానికి సగం సీట్లను జేడీఎస్ పార్టీ కోల్పోయింది. జేడీఎస్ పార్టీకి ఇంత తక్కువ సీట్లు వస్తాయని ఆ పార్టీ నాయకులు ఊహించలేకపోయారు. కర్ణాటకలో జేడీఎస్ పార్టీ దెబ్బ తింటుందని ముందుగానే పసిగట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారని ఇప్పుడు అర్థం అవుతోందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తీరు ముందుగానే తెలిసిందని. అందుకే ఆ రాష్ట్రంలో జేడీఎస్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చెయ్యలేదని సమాచారం. కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందుకే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్నారని, ఇప్పుడు కేసీఆర్ ఊహించినట్లే జరిగిందని కర్ణాటకకు చెందిన కొందరు నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications