మంచి విద్యార్ధిని కాను: మోడీ, మంత్రులకు విందు
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్రమోడీ సోమవారం నాడు ఢిల్లీలోని ఎయిమ్స్ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వైద్య విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. తాను మంచి విద్యార్దిని కాదని, ఎప్పుడూ అవార్డు అందుకోలేదని అన్నారు.
ఎల్లప్పుడూ విద్యార్దిగా ఉంటూ కొత్త విషయాలు నేర్చుకోవాలని.. విద్యార్ది దశ అయిపోయిందని ఎప్పుడూ అనుకోవద్దని మోడీ విద్యార్దులకు సూచించారు. స్నాతకోత్సవానికి ఓ సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తిని అతిధిగా పిలవడం వల్ల పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్ధులు స్పూర్తి పొందుతారని తెలిపారు.
ఈ భావన విద్యార్ధుల్లో ఎంతో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపుతుందని మోడీ అభిప్రాయపడ్డారు. వైద్యరంగంలో పరిశోధనలపై దృష్టిపెట్టాలని సలహా ఇచ్చారు.

మంత్రులకు ప్రధాని మోడీ విందు
ప్రధాని మోడీ సోమవారం సాయంత్రం తన మంత్రి వర్గంలోని 44 మంది మంత్రులకు విందు ఇవ్వనున్నారు. ఈ రోజు సాయంత్రం కేబినేట్ సమావేశం అనంతరం ఈ విందు ఉంటుంది.
ప్రధాని పదవి చేపట్టిన తర్వాత తొలిసారిగా మోడీ ఇస్తున్న ఈ విందు ప్రాధాన్యం సంతరించుకుంది.
పలు కీలక అంశాలపై తన మంత్రులతో మనసు విప్పి చర్చించేందుకే మోడీ ఈ విందును ఏర్పాటు చేశారని తెలుస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, ప్రభుత్వం అనుసరించాల్సిన విధివిధానాలపై భవిష్యత్ కార్యాచరణ గురించి ఈ విందులో మంత్రులతో మోడీ చర్చించనున్నారని సమాచారం.
మోడీ ప్రతిపాదనను తిరస్కరించిన గుజరాత్ సీఎం ఆనందీబెన్ పటేల్
గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ ప్రధాని మోడీ ప్రతిపాదనను తిరస్కరించారు. ఇంతకీ ఏంటీ ఆ ప్రతిపాదన అనుకుంటున్నారా..? గుజరాత్ రాష్ట్ర వ్యాపార రాజధాని అహ్మదాబాద్ మీదుగా సర్ఖెజ్-గాంధీనగర్ ప్రధాన రహదారిని
నిర్మించడం. ఈ ప్రతిపాదనను ఆనంది బెన్ ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.
ఈ రహదారి అభివృద్ధికి తామే నిధులిస్తామని కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రతిపాదించినా ఆనందిబెన్ పటేల్ నిర్మోహమాటంగా తిరస్కరించారు. అయితే, ఆనందిబెన్ పటేల్ తిరస్కరణ సరైందే అంటున్నారు ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. జన సంచారం అత్యధికంగా ఉండే అహ్మదాబాద్ మార్కెట్ మీదుగా ప్రధాన రహదారిని ఎలా ఏర్పాటు చేస్తారని కేంద్రాన్ని ప్రశ్నిస్తూ, ఆనందిబెన్ పటేల్‌కు వారు మద్దతు పలికారు.












Click it and Unblock the Notifications