శబరిమల ఆలయంలో వారికి ప్రవేశం లేదు: తేల్చి చెప్పిన కేరళ ప్రభుత్వం, టీడీబీ
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ దర్శనానికి సంబంధించి కేరళ ప్రభుత్వం హైకోర్టులో కీలకమైన అఫిడవిట్‌ను దాఖలు చేసింది. చట్టబద్ధమైన మెడికల్ డాక్యుమెంట్లు, అధికారిక లింగ గుర్తింపు ధృవీకరణ లేనిదే ట్రాన్స్జెండర్లకు ఆలయ ప్రవేశం గానీ, దర్శనం అనుమతి కల్పించడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. ఈ అంశంలో ట్రావెన్కోర్ దేవస్వమ్ బోర్డు తీసుకున్న నిర్ణయానికే తాము కట్టుబడి ఉంటుందని స్పష్టం చేసింది.
తమిళనాడుకు చెందిన సత్యశ్రీ షర్మిల రెహమత్అలీ అనే ట్రాన్స్‌జెండర్.. శబరిమల ఆలయ దర్శనానికి అయ్యప్ప భక్తులు పాటించే అన్ని నియమాలను పాటిస్తూ ప్రవేశం కల్పించాలని కోరుతూ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రభుత్వం స్పందించింది. లింగ మార్పిడి లేదా లింగ ధృవీకరణ పత్రాలు లేని పక్షంలో దర్శనానికి అనుమతించడం ఎంతమాత్రం సాధ్యపడదని తేల్చి చెప్పింది.

ఆలయ దర్శనానికి వచ్చే భక్తుల లక్షణాలను పరిశీలించి, వారి లింగాన్ని అధికారికంగా నిర్ధారించే సాంకేతిక సదుపాయాలు లేదా చట్టబద్ధమైన అధికారాలు ట్రావెన్కోర్ దేవస్వమ్ బోర్డుకు లేవని కేరళ ప్రభుత్వం తన అఫిడవిట్లో పేర్కొంది. లింగ నిర్ధారణ లేకుండా ఎవరినైనా ఆలయంలోకి అనుమతిస్తే తరతరాలుగా కొనసాగుతున్న పవిత్ర ఆచారాలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని దేవస్వమ్ బోర్డు యంత్రాంగం ఆందోళన వ్యక్తం చేసింది.
తాను గతంలో కూడా శబరిమలను దర్శించుకున్నట్లు సత్యశ్రీ షర్మిల తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 20వ తేదీన పంపా గణపతి ఆలయం వద్ద పోలీసులు చేపట్టిన సాధారణ తనిఖీల సమయంలో తనను అధికారులు అడ్డుకున్నారని, శబరిమల ఆలయ ప్రవేశానికి సంబంధించి ప్రత్యేక వయస్సు, లింగ ఆధారిత పవిత్ర ఆచారాలు అమలులో ఉన్నందున, పిటిషనర్ తన సొంత రాష్ట్రం తమిళనాడులోని సంబంధిత వైద్య అధికారుల నుంచి లింగ మార్పిడికి సంబంధించిన గుర్తింపు పత్రాలు చూపించాలని పోలీసులు సూచించారని వివరించారు.
ఈ పరిణామాల అనంతరం సత్యశ్రీ.. తిరువోణం పర్వదినాన దర్శనం కల్పించాలని కోరుతూ కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసు ఉన్నతాధికారులు, టీడీబీకి వినతిపత్రాలు పంపించారు. ఆలయ ఆచార వ్యవహారాల ఉల్లంఘన జరగకుండా చూడాల్సిన బాధ్యత ఆలయ యంత్రాంగంపై ఉన్నందున, స్పష్టమైన ఆధారాలు లేకుండా అనుమతి ఇవ్వలేమని ఈ సందర్భంగా టీడీపీ తేల్చి చెప్పింది.
శబరిమలలో అమలులో ఉన్న నిబంధనలు, సంప్రదాయ ఆచారాలు, మతపరమైన హక్కులకు సంబంధించిన వివాదాలన్నీ ప్రస్తుతం సుప్రీంకోర్టు సమక్షంలో విచారణలో ఉన్న విషయాన్ని ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది. అత్యున్నత న్యాయస్థానం ఈ అంశంపై పూర్తిస్థాయి తీర్పు వెలువరించే వరకు ఆలయ పవిత్రత, శతాబ్దాలుగా వస్తోన్న ఆచార వ్యవహారాలను కాపాడటం తమ బాధ్యతగా వివరించింది. నిబంధనల ఉల్లంఘనకు అవకాశం లేకుండా ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది.














Click it and Unblock the Notifications
