కేరళలో రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్-అరుదైన పరిణామం..!
రష్యాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అయితే భారత్ లోనూ రష్యా పౌరులకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ముఖ్యంగా కేరళలోని తిరువంతపురంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో రష్యన్ పౌరులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తిరువనంతపురంలోని రష్యన్ ఫెడరేషన్ గౌరవ కాన్సులేట్, రష్యన్ హౌస్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బూత్‌లో వారు ఓటు వేస్తున్నారు.
రష్యా అధ్యక్ష ఎన్నికలకు మూడవసారి పోలింగ్ ఏర్పాటు చేసినట్లు రష్యా గౌరవ కాన్సుల్, తిరువనంతపురంలోని రష్యన్ హౌస్ డైరెక్టర్ రతీష్ నాయర్ తెలిపారు. పోలింగ్ ప్రక్రియలో సహకరించినందుకు కేరళలోని రష్యా పౌరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రష్యా అధ్యక్ష ఎన్నికల కోసం రష్యన్ ఫెడరేషన్ కాన్సులేట్ ఇలా పోలింగ్ నిర్వహించడం ఇది మూడోసారి. వాస్తవానికి ఇక్కడ ఉంటున్న రష్యన్ జాతీయవాదులకు, పర్యాటకులకు కూడా ఇది ఓటు హక్కు వినియోగించుకోవడం మూడోసారి.

రష్యా అధ్యక్ష ఎన్నికల ఫ్రేమ్‌వర్క్‌లో ప్రాథమిక ఓటింగ్‌ను నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. భారతదేశంలో నివసిస్తున్న రష్యన్ ఫెడరేషన్ పౌరులకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించామన్నారు. మార్చి 15-17 తేదీల్లో రష్యా అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ నిర్వహిస్తున్నారు. రష్యా పౌరులు శుక్రవారం నుండి ఆదివారం వరకు దేశంలోని 11 కాలమాన ప్రాంతాల్లో ఓటు వేయనున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు వ్యతిరేకంగా ముగ్గురు అభ్యర్థులను మాత్రమే రష్యా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆమోదించింది.

పుతిన్‌పై ముగ్గురు అభ్యర్థులు లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన లియోనిడ్ స్లట్స్కీ, న్యూ పీపుల్ పార్టీకి చెందిన వ్లాడిస్లావ్ దావన్‌కోవ్, కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన నికోలాయ్ ఖరిటోనోవ్ పోటీలో ఉన్నారు. వీరంతా క్రెమ్లిన్ అనుకూలురుగా భావిస్తున్నారు. అలాగే ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు వీరెవరూ వ్యతిరేకం కూడా కాకపోవడం విశేషం..












Click it and Unblock the Notifications