‘మహా’ వర్షపాతం.. 4 రోజుల్లోనే నెల వాన! 40 రైళ్లు రద్దు, కొట్టుకుపోయిన హైవేలు
మహారాష్ట్రను రుతుపవన వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలను వానలు ముంచెత్తుతున్నాయి. కేవలం నాలుగు రోజుల్లోనే ముంబయి నగరం ఒక నెలకు సరిపడా వర్షపాతాన్ని నమోదు చేసిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న ఈ అకాల భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాలన్నింటినీ 'హై అలర్ట్' చేసినట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం ప్రకటించారు. మంత్రాలయంలోని డిజాస్టర్ కంట్రోల్ రూమ్‌లో విపత్తు నిర్వహణ శాఖ మంత్రి గిరీష్ మహాజన్, ఉన్నతాధికారులతో కలిసి సీఎం అత్యవసర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ముంబయి నగరంలో ఆదివారం ఏకంగా 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వీచిన అసాధారణ బలమైన ఈదురు గాలుల కారణంగా దాదాపు 300 చెట్లు కూలిపోయాయని సీఎం తెలిపారు. సోమవారం కూడా ఇదే స్థాయిలో గాలులు వీచే అవకాశం ఉండటంతో, ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా అన్ని కార్యాలయాలకు 'వర్క్ ఫ్రమ్ హోమ్' (ఇంటి నుంచే పనిచేసే విధానం) ప్రకటించినట్లు సీఎం స్పష్టం చేశారు. ముంబయి మెట్రో, బస్సులు సాధారణంగానే నడుస్తున్నప్పటికీ, లోకల్ రైల్వే నెట్‌వర్క్‌లో మాత్రం కొన్ని చోట్ల అంతరాయం ఏర్పడింది.

కొండచరియలు విరిగిపడి స్తంభించిన రవాణా వ్యవస్థ..
భారీ వర్షాల కారణంగా ముంబయి-పూణే ఘాట్ సెక్షన్‌లో సోమవారం భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రోడ్డు, రైలు రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ముంబయి-పూణే ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు పాత హైవేపై కూడా ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ప్రస్తుతం ముంబయి-పూణే హైవేలో ముంబయి వైపు 3 లేన్లు, పూణే వైపు ఒక లేన్‌ను పునరుద్ధరించి తాత్కాలికంగా రవాణాను కొనసాగిస్తున్నారు. ముంబయి-గోవా రహదారిని సైతం పునరుద్ధరించే పనులు వేగంగా జరుగుతున్నాయి.
రేపు క్లౌడ్‌బర్స్ట్, రెడ్ అలర్ట్ హెచ్చరికలు!
జూలై 7 (మంగళవారం) నాసిక్, త్రింబకేశ్వర్ మధ్య తీవ్రమైన క్లౌడ్‌బర్స్ట్ (మేఘమథనం) సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. అలాగే పాల్ఘర్, కొంకణ్ ప్రాంతాలకు 'రెడ్ అలర్ట్' జారీ చేయడంతో, పాల్ఘర్‌లో ముంపునకు గురయ్యే ప్రాంతాల నుంచి 500 మంది పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇంద్రాయణి నది ఉధృతంగా ప్రవహించి ఆలంది వైపు వెళ్లే నాలుగు వంతెనలు మునిగిపోవడంతో, భక్తులెవరూ ఆలంది ప్రాంతానికి వెళ్లవద్దని సీఎంబో (CMO) విజ్ఞప్తి చేసింది. జూలై 8 వరకు వర్షాల తీవ్రత ఇలాగే ఉంటుందని ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలను ముందస్తుగా మోహరించారు.
పట్టాలెక్కిన వరద.. రైల్వే ప్రయాణికుల విలవిల!
పాల్ఘర్ పరిధిలో కేవలం రెండు గంటల్లోనే దాదాపు 300 మిమీల రికార్డు స్థాయి వర్షం కురవడంతో వసాయి రోడ్-విరార్, సఫాలే-పాల్ఘర్ మధ్య రైల్వే ట్రాక్‌లు పూర్తిగా నీట మునిగాయి. దీంతో వెస్ట్రన్ రైల్వే పరిధిలో 40కి పైగా రైలు సర్వీసులు ప్రభావితమవగా.. కనీసం 22 దూరప్రాంత రైళ్లు వివిధ స్టేషన్లలో నిలిచిపోయాయి. రాజధాని ఎక్స్‌ప్రెస్, గరీబ్ రథ్, సౌరాష్ట్ర ఎక్స్‌ప్రెస్ వంటి కీలక రైళ్లపై ఈ ప్రభావం పడింది.
వేలాది మంది ప్రయాణికులు స్టేషన్లలో, రైళ్లలోనే చిక్కుకుపోవడంతో వెస్ట్రన్ రైల్వే స్థానిక స్వచ్ఛంద సంస్థల (NGO) సహకారంతో ఆహార పొట్లాలు, తాగునీరు పంపిణీ చేసింది. పాల్ఘర్ స్టేషన్లో గరీబ్ రథ్ ప్రయాణికులకు దాదాపు 500 భోజనం ప్యాకెట్లను అందించారు. ముంబయి సెంట్రల్, బాంద్రా టెర్మినస్, సూరత్ స్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. ట్రాక్‌ల పునరుద్ధరణ పనులు జరుగుతున్నందున, ప్రయాణికులు తమ రైలు స్టేటస్‌ను తనిఖీ చేసుకున్నాకే స్టేషన్లకు బయలుదేరాలని రైల్వే అధికారులు సూచించారు.














Click it and Unblock the Notifications