• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేరళ: ఒక్క చుక్క కూడా వేస్ట్ కాకుండా టీకాలు వేస్తున్నారు

By BBC News తెలుగు
|

వ్యాక్సీన్

కేరళలో కరోనా వ్యాక్సీన్ వృథా కాకుండా వ్యాక్సినేషన్ జరుగుతున్న పద్ధతిని ప్రధాని మోదీ ప్రశంసించారు. అక్కడి ఆరోగ్య కార్యకర్తల పనితీరును మెచ్చుకున్నారు.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 10 శాతం వరకు వ్యాక్సీన్ వృథాకు మినహాయింపు ఇచ్చింది. తమిళనాడులాంటి రాష్ట్రాల్లో వ్యాక్సీన్ వృథా రేటు 8.83 శాతం ఉండగా, లక్షద్వీప్‌లో రికార్డు స్థాయిలో 9.76 శాతం ఉంది.

మిగతా రాష్ట్రాల్లోనూ ఇంచుమించుగా ఇదే పరిస్థితి ఉంది. కానీ, కేరళలో మాత్రం పరిస్థితి వీటన్నిటి కంటే భిన్నంగా ఉంది.

కేంద్ర ప్రభుత్వం నుంచి కేరళకు 73,38,806 వ్యాక్సిన్ మోతాదులు అందాయి. అందులో 74,26,164 డోసులను ప్రజలకు ఇచ్చారు. అంటే అదనంగా 87,358 మందికి వ్యాక్సీన్ వేశారు.

వ్యాక్సీన్ ఏమాత్రం వ్యర్థం కాకుండా అందరికీ డోసులు వేశారు.

ఈ విషయాన్ని పినరయి విజయన్ ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ, "వ్యాక్సీన్ సీసాలలో అదనంగా ఉన్న డోసును కూడా వృథా చేయకుండా సమర్థంగా ప్రజలకు వ్యాక్సీన్ అందించినందుకు కేరళ ఆరోగ్య కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు" తెలిపారు.

దాన్ని ప్రధాని మోదీ రీట్వీట్ చేస్తూ, కేరళ ఆరోగ్య కార్యకర్తలను ప్రశంసించారు.

"కోవిడ్ 19ను ఎదుర్కోవాలంటే వ్యాక్సీన్ డోసుల వృథాను తగ్గించాలని" మోదీ అన్నారు.

వ్యాక్సీన్

కేరళ ఈ విజయాన్ని ఎలా సాధించింది?

వ్యాక్సినేషంలో భాగంగా కేరళ ఒక సమర్థ ప్రణాళికను అవలంబించింది.

ఐదు మిల్లీ లీటర్ల వ్యాక్సీన్ సీసాలో 10 డోసులు ఉంటాయి. అంటే ఒక సీసా తెరిస్తే పదిమందికి టీకాలు వేయవచ్చు.

వ్యాక్సీన్ తక్కువ కాకూడదు అనే ఉద్దేశంతో వ్యాక్సీన్ తయారీదారి సంస్థలు ప్రతీ సీసాలోనూ కొన్ని అదనపు టీకా చుక్కలను సరఫరా చేస్తున్నాయి.

అంటే ప్రతీ సీసాలోను 0.55 మి.లీ లేదా 0.6 మి.లీల ఔషధం అదనంగా ఉంటోంది.

"మా దగ్గర బాగా శిక్షణ పొందిన నర్సులు ఉన్నారు. ఒక్క టీకా చుక్క కూడా వృథా కాకుండా సీసా తెరిచిన తరువాత పదిమందికి బదులు 11 లేదా 12 మందికి వ్యాక్సీన్ వేస్తున్నారు" అని కోవిడ్ నిపుణుల కమిటీ సభ్యుడు అనీష్ టీఎస్ తెలిపారు. ఈ నిపుణుల బృందం కేరళ ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరిస్తోంది.

డాక్టర్ అనీష్ తిరువనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.

"మరొక ముఖ్య విషయం ఏమిటంటే, ఒక వ్యాక్సీన్ సీసా మూత తెరిచిన నాలుగు గంటల లోపలే 10 లేదా 12 మందికి టీకా వేసేయాలి. లేదంటే అది పాడవుతుంది. ఏరోజైనా వ్యాక్సీన్స్ సెంటర్‌లో 10 కన్నా తక్కువమంది ఉంటే, వ్యాక్సినేషన్ మరుసటి రోజుకు వాయిదా వేస్తారు" అని డాక్టర్ అనీష్ తెలిపారు.

ఇదే కాకుండా, కేరళలో ఆస్పత్రులన్నిటికీ ఒక పద్ధతి ప్రకారం వ్యాక్సీన్ పంపిణీ చేస్తున్నారు. ఏ ఆస్పత్రికీ కూడా 200 సీసాలకన్నా ఎక్కువ ఇవ్వట్లేదు.

"వాటిని కూడా మొదటి, రెండవ డోసుల మధ్య విభజిస్తున్నారు. 120 వ్యాక్సీన్ సీసాలను మొదటి డోసులకు ఉపయోగిస్తారు. మిగతా వాటిని రెండో డోసు ఇవ్వడానికి వినియోగిస్తారు" అని కేరళ ఆరోగ్య సేవల మాజీ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ తెలిపారు.

వ్యాక్సీన్ వృథా కాకుండా ప్రజలకు నిర్ణీత సమయాన్ని కేటాయిస్తున్నారని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

ఏరోజైనా తగినంతమంది రాకపోతే, మర్నాటికి వాయిదా వేస్తున్నారని, మర్నాడు వచ్చి టీకా వేసుకోమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారని అధికారులు తెలిపారు.

"కోవిషీల్డ్ సీసాల్లో కొంత అదనపు టీకా చుక్కలు ఉంటాయిగానీ కోవాగ్జిన్‌లో సరిగ్గా 5 మి.లీ మాత్రమే ఉంటుంది. ఎంత వ్యాక్సీన్ వృథా అవుతుంది అనేది రాష్ట్రాలకు ఎంత వ్యాక్సీన్ అందుతోంది అనేదానిపై ఆధారపడి ఉంటుంది. కేరళకు 90 శాతం కోవిషీల్డ్, 10 శాతం కోవాగ్జిన్ అందుతోంది" అని డాక్టర్ అనీష్ వివరించారు.

వ్యాక్సీన్

కేరళలో కోవిడ్ పరిస్థితి ఎలా ఉంది?

ప్రస్తుతం కేరళ తీవ్ర కరోనా సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది.

మే 6 నుంచి మే 18 వరకూ ఆ రాష్ట్రంలో లాక్‌డౌన్ ప్రకటించారు.

వలస కూలీలకు లాక్‌డౌన్ దుర్భరమవుతుంది అనడంలో సందేహం లేదు. పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, అస్సాం సహా అనేక రాష్ట్రాల నుంచి కేరళకు వలస కూలీలు వెళ్తుంటారు.

గత ఏడాది కరోనాను కట్టడి చేయడంలో కేరళ ఆరోగ్య మంత్రి కేకే శైలజ విజయం సాధించారని పలువురి ప్రశంసలు అందుకున్నారు.

అయితే, లాక్‌డౌన్ తరువాత అంతరాష్ట్రీయ ప్రయాణాలు మొదలవడంతో మళ్లీ కేరళలో కేసులు పెరగనారంభించాయి.

ప్రస్తుతం 28,740 మంది కోవిడ్ రోగులు ఆస్పత్రుల్లో ఉండగా, వారిలో 2033 మంది ఐసీయూల్లోనూ, 818 మంది వెంటిలేటర్లపైనా ఉన్నారు.

గత ఏడాది కేరళలో 97,417 యాక్టివ్ కేసులు నమోదవ్వగా, ప్రస్తుతం 3.75 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధిక కరోనా కేసుల జాబితాలో దేశంలో మూడో స్థానంలో ఉంది.

గురువారం గరిష్ఠంగా 40,000కు పైగా కేసులు నమోదయ్యాయి.

వ్యాక్సీన్

వ్యాక్సినేషన్ ఎంతవరకు ఉపయోగపడుతుంది?

సమర్థవంతమైన వ్యాక్సినేషన్ ప్రక్రియ కారణంగా మరణాల రేటు తగ్గిందని కేరళ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

"ఆరోగ్య కార్యకర్తలకు, 60 ఏళ్లు పైబడినవారికి రెండు డోసులూ లేదా కనీసం ఒక డోసు ఇచ్చినప్పటినుంచీ మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది" అని కేరళ కోవిడ్ నిపుణుల కమిటీ సభ్యుడు కేపీ అరవిందన్ తెలిపారు.

అయితే, యువతకు కోవిడ్ సోకుతున్న రేటు అధికంగా ఉందని, వ్యాక్సీన్ లభ్యత పెరిగితే కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అరవిందన్ అభిప్రాయపడ్డారు.

మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిలో కేరళ మిగతా రాష్ట్రాల కన్నా ఎంతో ముందుంది.

అయినప్పటికీ, తీవ్ర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేరళకు 1,000 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేయాలని పినరయి విజయన్ ప్రధానిని కోరారు.

కేరళలో టెస్ట్ పాజిటివిటీ రేటు 25.69% గా ఉంది. అంటే టెస్ట్ చేసిన ప్రతీ నాలుగో వ్యక్తికీ కరోనా పాజిటివ్ వస్తున్నట్లు లెక్క.

ఈ గణాంకాలన్నీ కేరళలో కోవిడ్ సంక్షోభాన్ని వివరిస్తాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Kerala:Not a single drop of Vaccine is being wasted
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X