గూగుల్ మ్యాప్స్ నమ్ముకుని వెళ్తే నదిలోకి కారు:ఇద్దరు వైద్యులు మృతి
తిరువనంతపురం: గూగల్ మ్యాప్స్, జీపీఎస్ ఆధారంగా ప్రయాణించి ఇద్దరు వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. కారు నేరుగా నదిలోకి వెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విషాద ఘటన కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. కొల్లాంకు చెందిన డాక్టర్ అద్వైత్ (29), త్రిసూర్‌కి చెందిన డాక్టర్ అజ్మల్ (29) ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విధులు ముగించుకుని కొడుంగలలూరు నుంచి ఇళ్లకు బయల్దేరారు.
వీరితోపాటు మరో ముగ్గురు డాక్టర్లు తబ్సిర్, మన్నా, నర్స్ జిస్మాన్ కూడా ఉన్నారు. హోండా సివిక్ కారులో బయల్దేరారు. మరుసటి రోజు అద్వైత్ పుట్టిన రోజు ఉండటంతో వీరంతా కలిసి షాపింగ్ చేిస తిరుగు పయనమయ్యారు. కారును అతనే డ్రైవ్ చేశాడు. అయితే, భారీ వర్షం పడటంతో రోడ్డు సరిగా కనిపించకపోవడంతో గూగుల్ మ్యాప్స్‌ని అనుసరించి కారును నడిపారు.

ఈ క్రమంలోనే రోడ్డుపై నీరు నిలిచి ఉందని భావించి అద్వైత్ కారుని పెరియార్ నదిలోకి పోనిచ్చాడు. కారు నదిలోకి వెళ్లిందని గ్రహించే లోపే నీటిలో మునిగిపోయింది. ఈ ప్రమాదం అర్ధరాత్రి 12.30 గంటలకు జరగింది. అద్వైత్, అజ్మల్ కారుతోనే మునిగిపోయారు. మిగితా ముగ్గురు గాయాలతో కారు నుంచి బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. వీరిని స్థానికులు కాపాడారు.
స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు వచ్చి అద్వైత్, అజ్మల్ మృతదేహాలను బయటికి తీశారు. గూగుల్ మ్యాప్స్ ను అనుసరించి వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగిందని గాయాలతో బయటపడిన తమన్నా చెప్పారు. అయితే, గూగుల్ మ్యాప్స్ చూపినట్లుగా కాకుండా మరోవైపు వెళ్లడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications