బీజేపీ కూటమి విజయం వెనుక - ఆ పథకమే గేమ్ ఛేంజర్..!!
మహారాష్ట్రలో మహాయుతి కూటమి సంచలన విజయం నమోదు చేసింది. ఊహించని విధంగా ఏకపక్షంగా అధికారం దిశగా దూసుకెళ్తోంది. తమదే గెలుపు అని ఆశలు పెట్టుకున్న ఎంవీఏ కూటమిని మరాఠా ప్రజలు తిరస్కరించారు. నామ మాత్రపు సీట్లకు పరిమితం చేసారు. మహాయుతి విజయం వెనుక ఓబీసీ అంశం బలంగా పని చేసింది. అదే విధంగా బీజేపీ నేతల ప్రచారం.. ఎన్నికల హామీలు ప్రజల్లోకి వెళ్లాయి. సమిష్టిగా మహాయుతి నేతలు పని చేయటమే విజయానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
పక్కా వ్యూహాత్మకంగా
మహారాష్ట్రలో మహుయుతి కూటమి అఖండ విజయం సాధించింది. 288 సీట్లు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో 220 పైగా స్థానాలు గెలుచుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మహావికాస్ అఘాడీ మాత్రం 50 సీట్లలోనే ఆధిక్యత కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో స్థానిక అంశాలకు అనుగుణంగా మహాయుతి కూటమి వ్యూహాత్మకంగా ప్రచారం సాగించింది. ఎన్నికల్లో గెలివాలంటే కీలకమైన మరాఠా, మహిళా, యువత, ఓబీసీలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ప్రభుత్వం కొనసాగిస్తున్న పథకాలతో పాటుగా మరిన్ని హామీలు ఇచ్చింది. ఆ హామీలే ఎన్నికల్లో బ్రహ్మాస్త్రంగా పని చేసాయి. ఎంవీఏ కూటమి హామీలు ఇచ్చినా..అమలు చేస్తున్న మహాయుతి వైపే ప్రజలు మొగ్గు చూపించారు.

మహుయుతి విజయం వెనుక
ఈ ఎన్నికల్లో ఇప్పటికే అమలులో చేస్తున్న లడ్‌కీ బెహన్ పథకం మొత్తాన్ని పెంచి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం 15వందలుగా ఉన్న ఈ పథకం లబ్ది మొత్తం తాము అధికారంలోకి వస్తే 2వేల 100కి పెంచారు. ఈ పథకం కింద మహిళలకు మూడు నెలల మొత్తాన్ని ముందుగానే ఇచ్చారు. ప్రస్తుతం అందిస్తున్న వృద్ధాప్య పెన్షన్ రూ.15 వందల నుంచి రూ. 2వేల 100కి పెంచుతామన్నారు. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని బీజేపీ ఇచ్చిన హామీ ఈ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ గా మారింది. ఇక.. రైతులకు షెట్కారీ సమ్మాన్ యోజన కింద ఏటా రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. రైతులు, మహిళలతో పాటుగా విద్యార్ధులకు హామీలు గుప్పించింది. విద్యార్థులకు 25 లక్షల ఉద్యోగాలు, 10 లక్షల మంది విద్యార్థులకు నెలకు రూ.10వేల చొప్పున ఇస్తామని ఇచ్చిన హామీలు పని చేసాయి.

గేమ్ ఛేంజర్ హామీ
మహావికాస్ అఘాడీ సైతం మహిళల కోసం నెలకు రూ.3వేలు, ఉచిత్ బస్ సదుపాయం కల్పిస్తా మని ప్రకటించింది. 3లక్షల రుణమాఫీ పైనా హామీ ఇచ్చింది. 4వేల నిరుద్యోగ భృతి, కుటుంబా నికి రూ.25లక్షల ఆరోగ్య బీమా లాంటి కీలక హామీలను గుప్పించింది. కానీ, ప్రస్తుత బీజేపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు పక్కాగా అందటం.. వాటిని అమలు చేస్తున్న తీరునే మరింతగా పెంచుతామనే హామీని మరాఠా ప్రజలు విశ్వసించారు. ఇక, మహారాష్ట్రలో ప్రధాని ఎన్నికల వేళ రాష్ట్ర భవిష్యత్ కోసం అంటూ వేల కోట్ల ప్రాజెక్టులు ప్రారంభించారు. యువతను ఆకట్టుకునే ప్రసంగాలతో మొత్తంగా ఫలితాలనే తమ వైపు తిప్పుకున్నారు. తాజా ఫలితాల పైన ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ కూటమి ఘోర పరాభవం మిగిలింది.

కూటమి అక్కడే వైఫల్యం
సీనియర్ నేత శరద్ పవార్ వ్యూహాలు పని చేయలేదు. సానుభూతి కలిసి వస్తుందనే ఉద్ధవ్ థాక్రే అంచనాలు విఫలమయ్యాయి. ఈ రెండు పార్టీలతో కలిసి వెళ్లటం ద్వారా పార్లమెంట్ ఎన్నికల్లో సాధించిన ఫలితాలే అసెంబ్లీలోని సాధిస్తామని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. మిత్రపక్షాలతో సీట్లతో సహా ప్రతీ అంశంలోనూ రాజీ ధోరణితోనే వ్యవహరించింది. కానీ, మహారాష్ట్ర ప్రజలు ఆదరించ లేదు. ప్రధాని మోదీ మహాయుతికి స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరించారు. పథకాలు, ఓబీసీ అంశం, కుల గణన వంటివి ప్రధానంగా ప్రస్తావించారు. ఐక్యత గురించి ప్రధాని చెప్పిన అంశాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. ఫలితంగా గతం కంటే మెరుగైన సీట్లతో ప్రజలు బీజేపీ కూటమికి పట్టం కట్టారు. ఊహించని విజయం అందించారు.












Click it and Unblock the Notifications