శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు వాటిని వెంట తీసుకెళ్లాల్సిందే- కేరళ సర్కార్ సూచన..!!
మండల పూజ కోసం నేడు శబరిమలలో వెలసిన అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకోనుంది. ఈ సాయంత్రం 5 గంటలకు శాస్త్రోక్తంగా స్వామివారి ఆలయాన్ని తెరవనున్నారు ప్రధాన అర్చకులు. రేపటి నుండి మణికంఠుడి దర్శనానికి భక్తులకు అనుమతి లభిస్తుంది. సుదూర ప్రాంతాల నుంచి అయ్యప్పను దర్శించుకోవడానికి వ్యయ, ప్రయాసలను ఓర్చి శబరిమలకు వస్తుంటారు. వారి కోసం కేరళ ప్రభుత్వం హెల్త్ అడ్వైజరీని ఇచ్చింది.
కేరళ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్రంలో ఇటీవల నమోదైన మెదడు వాపు కేసుల దృష్ట్యా.. తాజా మార్గాదర్శకాలు, సూచనలు పాటించాలని కోరింది. నదీ స్నానం చేసేటప్పుడు ముక్కులోకి నీళ్లు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా సూచించింది. వైద్య చికిత్స పొందుతున్న యాత్రికులు ఆరోగ్య రికార్డులు, మందులను తమ వెంట తెచ్చుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

యాత్రికులు నెమ్మదిగా, ప్రశాంత మనస్సుతో కొండ ఎక్కాలని, మార్గమధ్యలో తగినంత విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అలసట, ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం లేదా నీరసంగా ఉండటం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని అన్నారు. అత్యవసర పరిస్థితుల కోసం 04735 203232 నంబర్‌ను సంప్రదించాలని చెప్పారు.
మరిగించిన నీటిని మాత్రమే తాగాలని, భోజనానికి ముందు చేతులు కడుక్కోవాలని, కడిగిన పండ్లను తినాలని, నిల్వ ఉన్న లేదా బయట ఉంచిన ఆహారాన్ని తీసుకోవడాన్ని తగ్గించుకోవాలని మార్గదర్శకాలు స్పష్టం చేశాయి. బహిరంగ మల విసర్జనపై పూర్తిగా నిషేధం ఉంది. భక్తులు టాయిలెట్లను మాత్రమే ఉపయోగించాలని, పరిశుభ్రత పాటించాలని అధికారులు సూచించారు. వ్యర్థాలను నిర్ణీత చెత్తబుట్టల్లో మాత్రమే వేయాలని కోరారు.
పాముకాటుకు గురైతే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని, ఆసుపత్రుల్లో యాంటీ వీనం అందుబాటులో ఉందని ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. మెడికల్ కాలేజీల్లో శిక్షణ పొందిన స్వచ్ఛంద ఆరోగ్య కార్యకర్తలను యాత్ర మార్గాల్లో మోహరింపజేశామని, పంపాలో 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశామని చెప్పారు. అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ఆరోగ్య కేంద్రంలో చికిత్స తీసుకోవాలని భక్తులకు సూచించారు.












Click it and Unblock the Notifications