ఖుష్బూకు అసలుకే ఎసరు: చిద్దూ మోకాలడ్డు?

చెన్నై: కాంగ్రెసు నేత, సినీ నటి ఖుష్బూ పరిస్థితి దారుణంగా మారింది. ఆమెకు పోటీ చేసేందుకు టికెట్ దొరుకుతుందా, లేదా అనేది కూడా అనుమానంగానే మారింది. కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ఆమెకు మోకాలడ్డుతున్నారు. ఆర్‌.కె.నగర్లో అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలితపై ఆమె పోటీ చేస్తున్నట్లు ప్రచారం సాగింది. ఆమె కూడా అధిష్ఠానం ఆదేశిస్తే పోటీకి సిద్ధమని ప్రకటించారు.

ఖుష్బూ ఉత్సాహాన్ని నీరు గారుస్తూ ఆర్‌.కె.నగర్‌లో డీఎంకే అభ్యర్థిగా సిమ్లా ముత్తుచోళన్‌ను ప్రకటించారు. దాంతో ఇప్పుడు ఖుష్బూ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తిగా మారింది. మైలాపూర్‌ నుంచి పోటీ చేయాలని ఆమె అనుకుంటున్నారు.

అయితే పార్టీలో ఆమె అభ్యర్థిత్వాన్ని బలమైన వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్‌ కీలకమైన పి.చిదంబరం వర్గీయులు ఖుష్బూ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీఎన్‌సీసీ అధ్యక్షులు ఈవీకేఎస్‌ ఇలంగోవన్‌ మాత్రం ఖుష్బూను ఎన్నికల బరిలో నిలబెడితే ప్రచారపరంగా బాగా లాభిస్తుందని అనుకుంటున్నారు.

Khushboo may not get Congress ticket

మైలాపూర్‌లో అన్నాడీఎంకే తమ అభ్యర్థిగా మాజీ డీజీపీ నటరాజన్‌ను బరిలోకి దింపింది. నగరంలో అందరికీ చిరపరిచితుడైన నటరాజన్‌ను అంతే స్థాయిలో ఢీకొనాలంటే ఖుష్బూ లాంటి వ్యక్తి సరైన అభ్యర్థి అని ఇలంగోవన్‌ భావిస్తున్నారు.

ఆ సీటు కోసం కాంగ్రెసులో తీవ్రమైన పోటీ ఏర్పడింది. చిదంబరం వర్గీయులు మైలాపూర్‌ టికెట్‌ కోసం పట్టుబడుతున్నారు. అక్కడ ఖుష్బూను నిలబెడితే ఆమెను ఓడిస్తామని అధిష్ఠానానికి హెచ్చరికలు పంపుతున్నారు. దాంతో ఆమెను ఎక్కడి నుంచి నిలబెట్టాలో తెలియక ఇబ్బంది పడుతోంది.

ఆర్‌.కె.నగర్‌లో జయలలితపై ఖుష్బూనే నిలబెట్టాలని అటు కాంగ్రెస్‌, డీఎంకేలు మొదట నిర్ణయించాయని సమాచారం. కాంగ్రెస్‌ కంటే ముందుగా డీఎంకే శిబిరం నుంచే ఈ ప్రతిపాదన వచ్చిందని తెలుస్తోంది. ఈ దిశగా ఈవీకేఎస్‌ ఇలంగోవన్‌ కూడా కరుణానిధితో చర్చలు జరిపినట్లు చెబుతున్నారు.

Khushboo may not get Congress ticket

బుధవారం కాంగ్రెస్‌ అధిష్ఠానం తరఫున ముకుల్‌వాస్నిక్‌ వచ్చి కరుణానిధితో భేటీ జరిపి తరువాత ఆర్‌.కె.నగర్‌ నుంచి ఖుష్బూ అభ్యర్థిత్వాన్ని ప్రకటించాలని భావించారు. అయితే స్టాలిన్‌ ఆమె అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. పైగా అక్కడ ఖుష్బూ పోటీ చేయాలంటే కొన్ని షరతులు కూడా వర్తిస్తాయని కాంగ్రెస్‌ చెప్పినట్లు తెలుస్తోంది. దానికి డీఎంకే అంగీకరించలేదని అంటున్నారు. దాంతో డీఎంకే తరఫున సిమ్లాముత్తుచోళన్‌ను అక్కడ రంగంలోకి దించారు.

మైలాపూర్‌ నుంచి ఖుష్బూను నిలబెడితే అక్కడ కాంగ్రెస్‌ పార్టీ నుంచే ఆమెకు గట్టి పోటీ ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే అక్కడ కరాటే త్యాగరాజన్‌ పోటీ చేయాలని భావిస్తున్నారు. ఖుష్బూకు టికెట్‌ ఇస్తే కరాటే త్యాగరాజన్‌ను తిరుగుబాటు అభ్యర్థిగా చిదంబరం వర్గం నిలబెట్టే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆ వర్గం నేతలు ఈ దిశగా బహిరంగంగా ప్రకటన కూడా చేశారు.

డీఎంకేలో ఉన్నప్పుడు ఖుష్బూ స్టాలిన్‌తో విభేదించి బయటికొచ్చారు. ఇప్పుడు ఆమె ఎన్నికల్లో నిలబడితే డీఎంకే వర్గాలు, స్టాలిన్‌ అనుచరులు ఆమె విజయం కోసం పాటుపడరని ఆ వర్గం వాదిస్తోంది. ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తే, తన నియోజకవర్గానికే పరిమితమవ్వాల్సి ఉంటుందని, పోటీ చేయకుండా ఉంటే ఆమె రాష్ట్రమంతటా పర్యటించి పార్టీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేయవచ్చని చిదంబరం వర్గీయులు వాదిస్తున్నారు. అసలుకే ఎసరు పెట్టేందుకు చిదంబరం వర్గీయులు ఆ వాదనలను ముందుకు తెచ్చినట్లు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+