Mercury Swallow: నోటిలో పగిలిన థర్మామీటర్.. పాదరసం మింగేసిన చిన్నారి.. తర్వాత ఏం జరిగిందంటే..
Broken Thermometer: ఆరోగ్య సంరక్షణ కోసం తరచుగా ఉపయోగించే వస్తువు అకస్మాత్తుగా అనారోగ్య కారకంగా మారింది. జ్వరం చెక్ చేసేందుకు వినియోగించే థర్మామీటర్ చిన్నారికి ప్రాణంతకంగా తయారైంది. తల్లిదండ్రులు, వైద్యులు వెంటనే స్పందించడంతో ఓ చిన్నారి సంభావ్య తీవ్ర అనారోగ్య పరిస్థితుల నుంచి గట్టెక్కింది. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన.. పిల్లల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిచాలని హెచ్చరిస్తోంది.
థర్మామీటర్ నోటిలో పగిలిపోవడంతో రెండేళ్ల చిన్నారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మొదట్లో కడుపు నొప్పి లేదా వాంతులు వంటి లక్షణాలు కనిపించ లేదు. ఎంత మోతాదులో పాదరసం కడుపులోకి వెళ్లిందో అంచనా వేయడం కష్టంగా మారింది. సీరం మరియు యూరిన్ మెర్క్యురీ లెవల్స్ సహా అన్ని సాధారణ పరీక్షలు నిర్వహించారు. చివరికి చెస్ట్ ఎక్స్‌రే ద్వారా గణనీయమైన మొత్తంలో పాదరసం ప్రేగు అంతటా వ్యాపించిందని తేలింది.

పాదరసాన్ని కడుపులో నుంచి బయటకు పంపించే ప్రయత్నాలు అనుకున్న స్థాయిలో సఫలం కాలేదు. దీంతో 48 గంటల తర్వాత HCMCT మణిపాల్ హాస్పిటల్‌లోని పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజీ మరియు హెపటాలజీ హెడ్ డాక్టర్ సుఫ్లా సక్సేనాతో కూడిన వైద్య బృందం అత్యవసర కోలనోస్కోపీని కొనసాగించారు. ఆ సమయంలో పాదరసం పెద్ద ప్రేగు అంతటా పాకడంతో పాటు దాని కొన వద్ద పేరుకుపోయింది.
పెద్దప్రేగు నుంచి పాదరసాన్ని బయటకు తీయడానికి కాంప్రహెన్సివ్ బోవెల్ లావేజ్ ప్రక్రియ నిర్వహించి విజయవంతమయ్యారు. అనంతరం తీసిన ఎక్స్-రేలో పాదరసం పూర్తిగా క్లియర్ చేయబడినట్లు నిర్ధారించుకున్నారు. ఇది చీలేషన్ థెరపీ అవసరాన్ని నివారించడంతో మరుసటి రోజు ఆ చిన్నారిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. పాదరసం అత్యంత విషపూరిత మూలకమని, క్లిష్టమైన శరీర అవయవాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందని సక్సేనా తెలిపారు. గుండె, కేంద్ర నాడీ వ్యవస్థ మరియు మూత్రపిండాలను సరైన సమయంలో అనాలిసిస్ చేయడం ద్వారా బిడ్డను కాపాడినట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications