బెంగళూరులో అమానుషం- నిర్జన ప్రదేశంలో.. సగం కాలిపోయిన స్థితిలో..
బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. కిడ్నాప్ కు గురైన 13 సంవత్సరాల బాలుడు నిశ్చిత్.. ఇక లేడు. బెంగళూరు శివార్లల్లో అతని మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితులను ఛేజ్ చేసి మరీ పట్టుకున్నారు. ఆ సమయంలో కాల్పులు జరిగాయి. ఈ ఘటన.. ఉద్రిక్తతలకు దారి తీసింది.
బెంగళూరు హులిమావు పోలీస్ స్టేషన్ పరిధిలోని అరెకెరె శాంతినికేతన్ లే అవుట్ లో నివసిస్తోన్నాడు నిశ్చిత్. ఆ బాలుడి తండ్రి ఓ ప్రైవేట్ కాలేజీలో ప్రొఫెసర్ గా పని చేస్తోన్నారు. క్రైస్ట్ స్కూల్ లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. బుధవారం నాడు ట్యూషన్ కు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు.

అతని తల్లిదండ్రులు అన్ని చోట్లా వెదికారు గానీ జాడ కనిపించలేదు. దీంతో హులిమావు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అన్ని చోట్లా గాలించారు గానీ ఫలితం కనిపించలేదు. అదే సమయంలో- నిశ్చిత్ ను కిడ్నాప్ చేసినట్లు తల్లిదండ్రులకు ఫోన్ కాల్ అందింది. వారు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. అయిదు లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు తెలిపారు.
దీంతో ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. అనుమానితులతో పాటు కొందరు పాత నేరస్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారి నుంచి సరైన సమాచారం రాలేదు. ఇదిలావుండగా- గురువారం సాయంత్రం కగ్గలిపుర సమీపంలో నిర్జన ప్రదేశంలో సగం కాలిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. బన్నేరుఘట్ట పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న వెంటనే బెంగళూరు సిటీ పోలీస్ జాయింట్ కమిషనర్ రమేష్ బానోత్, డిప్యూటీ పోలీస్ కమిషనర్, పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ మృతదేహం బాలుడిది కావడం, ఒంటిపై ఉన్న దుస్తుల ఆధారంగా అది నిశ్చిత్ దేనని నిర్ధారించారు. తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.
ఆ మృతదేహం నిశ్చిత్ దే కావడంతో తల్లిదండ్రుల శోకానికి అంతు లేకుండా పోయింది. పోస్ట్ మార్టమ్ కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఫోన్ కాల్స్, సీసీటీవీ ఫుటేజీ, ఇతర పక్కా ఆధారాలు అందడంతో ఈ కేసులో ఇద్దరిని నిందితులుగా గుర్తించారు పోలీసులు.
వారిని అరెస్ట్ చేయడానికి వెళ్లగా.. వారు ఆయుధాలతో దాడికి దిగారు. తప్పించుకుని పారిపోయారు. దీంతో పోలీసులు ఛేజ్ చేసి వారిని పట్టుకున్నారు. ఆ సమయంలో వారిపై కాల్పులు సైతం జరిపారు. అనంతరం వారిని అరెస్ట్ చేశారు. ఈ కాల్పుల్లో స్వల్పంగా గాయపడ్డ నిందితులను విక్టోరియా ఆసుపత్రిలో చేర్చారు. బీఎన్ఎస్ లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications