మృత్యువుతో 3 రాత్రులు దోబూచులాట, చుట్టూ క్రూర మృగాలు.. చివరికి

కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఉన్న అత్యంత ఎత్తైన శిఖరం 'తడియండమోల్'. దట్టమైన అడవి, ఏనుగుల సంచారం, అకస్మాత్తుగా కురిసే భారీ వర్షాలు.. ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల మధ్య ఒక మహిళా పర్యాటకురాలు నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడి గెలిచింది. ఒక పక్క ప్రభుత్వం డ్రోన్లు, డాగ్ స్క్వాడ్‌లతో గాలిస్తుంటే, మరోపక్క ఆకలి, చలిని తట్టుకుంటూ ఆమె సాగించిన ఈ పోరాటం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

కేరళలోని కోజికోడ్ నుంచి సోలో ట్రిప్ కోసం కొడగు చేరుకున్న 36 ఏళ్ల జీఎస్ శరణ్య, ఏప్రిల్ 2వ తేదీ గురువారం నాడు సరదాగా ట్రెకింగ్‌కు బయలుదేరింది. 'చిన్న ట్రెక్కే కదా' అని భావించి ఆహారం కూడా వెంట తీసుకెళ్లలేదు. కానీ, ప్రకృతి ఆమెకు ఊహించని షాక్ ఇచ్చింది. కొండ దిగుతున్న క్రమంలో దారి తప్పి దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయింది. మొబైల్ నెట్‌వర్క్ మాయమైంది.. స్నేహితుడికి 'దారి తప్పాను' అని మెసేజ్ టైప్ చేసేలోపే బ్యాటరీ డెడ్ అయి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. నాగరిక ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి, క్రూర మృగాలు సంచరించే అడవిలో ఆమె ఒంటరిదైపోయింది.

Kodagu Forest Rescue 36 Year Old Woman Trekker Found Alive After 4 Days in Dense Tadiandamol Jungle

నాలుగు రాత్రులు.. మృత్యువు ముంగిట పోరాటం!

మొదటి రోజు కాళ్ల నొప్పితో కదల్లేకపోయిన శరణ్య, రెండో రోజు ఒక రాతిపైనే ఉండిపోయింది. పైన తిరుగుతున్న డ్రోన్ కెమెరాకు తను కనిపిస్తానని ఆశపడింది. కానీ, మూడో రోజు కురిసిన భారీ వర్షం ఆమె ఆశలను అడియాశలు చేసింది. గడ్డకట్టే చలి, తడిసిన బట్టలతో ఆ రాత్రంతా వణికిపోయింది. ఆహారం లేదు.. కేవలం అటవీ ప్రవాహాల్లో దొరికిన నీటినే తాగుతూ ప్రాణాలు నిలబెట్టుకుంది. "నాకు ఎందుకో భయం వేయలేదు" అని ఆమె ధీమాగా చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏనుగులు తిరిగే ఆ ప్రాంతంలో ఆమె నాలుగు రాత్రులు గడపడం ఒక అద్భుతమనే చెప్పాలి.

గిరిజన తెగ సాహసం.. సురక్షితంగా బయటపడ్డ పర్యాటకురాలు

శరణ్య ఆచూకీ కోసం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశాలతో ప్రభుత్వం భారీ ఆపరేషన్ చేపట్టింది. అటవీ శాఖ, పోలీసులు, నక్సల్ వ్యతిరేక దళం, థర్మల్ డ్రోన్లు ఇలా 40 మందికి పైగా సిబ్బంది రంగంలోకి దిగారు. చివరకు ఆదివారం మధ్యాహ్నం, స్థానిక "కుడియ" గిరిజన తెగకు చెందిన రెస్క్యూ బృందం ఆమె అరుపులు విని గుర్తించింది. దట్టమైన పొదల మధ్య నుంచి ఆమెను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. రక్షించిన వారితో నవ్వుతూ నడుచుకుంటూ వస్తున్న శరణ్య వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ట్రెక్కర్లకు హెచ్చరిక.. సాహసం చేయకండి!

ఈ ఘటనపై అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే స్పందిస్తూ, ట్రెకింగ్‌కు వెళ్లే పర్యాటకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అటవీ నిబంధనలను అతిక్రమించవద్దని సూచించారు. శరణ్య ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆమెను సురక్షితంగా ఇంటికి పంపేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రకృతి అందాలను చూడాలనే ఉత్సాహం ఉండొచ్చు కానీ, అడవిలో ఏ చిన్న పొరపాటైనా ప్రాణాల మీదకు తెస్తుందని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+