బెంగళూరు తొక్కిసలాట ఘటనలో బిగ్ షాట్స్ అవుట్
Bengalur stampede: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025 ట్రోఫీని గెలుచుకున్న సందర్భంగా నిర్వహించ తలపెట్టిన విజయోత్సవ ర్యాలీలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన.. మలుపులు తిరుగుతోంది. ఇందులో- రోజురోజుకూ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఈ ఘటనలో 11 మంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. పలువురు తీవ్రంగా గాయపడ్డారుజ
ఈ ఘటనలో సీనియర్ ఐపీఎస్ అధికారులతో పలు పలువురు పోలీసు అధికారులపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారథ్యంలోని కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే వేటు వేసింది. బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ బీ దయానంద, అదనపు కమిషనర్ వికాస్ కుమార్, సెంట్రల్ జోన్ డీసీపీ శేఖర్ తక్కణ్ణనవర్, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ బాలకృష్ణ, కబ్బన్ పార్క్ ఇన్ స్పెక్టర్ గిరీష్ ను సస్పెండ్ చేసింది.

తొక్కిసలాటపై సమగ్ర విచారణ చేపట్టడానికి న్యాయమూర్తి జస్టిస్ మైఖెల్ డీ కున్హ సారథ్యంలో ప్రత్యేకంగా కమిషన్ ను సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇదే ఘటనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మార్కెటింగ్ నిఖిల్ సొసాలె అరెస్ట్ అయ్యారు. మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇప్పుడు తాజాగా కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ లో ఇద్దరు బిగ్ షాట్స్ అవుట్ అయ్యారు. తమ పదవులకు రాజీనామాలు చేశారు. క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి శంకర్, కోశాధికారి జైరామ్ తమ పదవుల నుంచి తప్పుకొన్నారు. క్రికెట్ అసోసియేషన్ గవర్నింగ్ బాడీకి రాజీనామా పత్రాలను పంపించారు.
బెంగళూరు తొక్కిసలాట ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాలను చేశామని అందులో పొందుపరిచారు. వెంటనే వాటిని ఆమోదించాలని కోరారు. ఎం చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట సంభవించడంలో క్రికెట్ అసోసియేషన్ పాత్ర లేనప్పటికీ- ఆ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తోన్నామని పేర్కొన్నారు.
మరోవంక ఈ దుర్ఘటనను కర్ణాటక హైకోర్టు తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. సుమోటోగా ఈ కేసును స్వీకరించింది. 11 మంది దుర్మరణానికి దారి తీసిన ఈ ఘటనలో వైఫల్యం ఎవరిదనే విషయంపై హైకోర్టు విచారణ జరుపుతోంది. ఇలాంటి సందర్భాల్లో ఎలా వ్యవహరించాలనే విషయంపై మార్గదర్శకాల రూపకల్పన వంటి అంశాలు విచారణకు వస్తోన్నాయి.












Click it and Unblock the Notifications