బీజేపీ నుంచి లత రజినీకాంత్: ఢిల్లీ స్థాయిలో గట్టిగానే ప్లాన్ చేసిన సూపర్ స్టార్
ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో తమిళనాడులో టీవీకే అధికారంలోకి వచ్చినపప్పటి నుంచీ అక్కడి రాజకీయాలు అంతుచిక్కని విధంగా తయారయ్యాయి. ఓటర్ల పల్స్ పట్టడం కష్టతరమౌతోంది. ఎప్పటికప్పుడు పొలిటికల్ ఈక్వేషన్లు మారుతూ వస్తోన్నాయి. అనూహ్య మార్పులు చోటుచేసుకుంటోన్నాయి. ఈ పరిణామాలన్నీ కూడా సినిమా స్టార్లు, వాళ్ల కుటుంబ సభ్యుల చుట్టే తిరుగుతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ పేరు తెరమీదికి వచ్చింది. గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో మకాం వేయడం చర్చనీయాంశమైంది. ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో ద్వారా అందుతోన్న విశ్వసనీయ సమాచారం ప్రకారం.. లతా రజనీకాంత్ చేపట్టిన ఈ ఢిల్లీ పర్యటన వెనుక పెద్ద వ్యూహమే ఉంది. రాజ్యసభ సీట్ దక్కించుకోవడమే ఆమె విశ్వ ప్రయత్నాలు సాగిస్తోన్నారనే ప్రచారం జరుగుతోంది.

తనకు ఆ అవకాశం లభించక పోతే.. రజనీకాంత్‌ను రాజ్యసభకు నామినేట్ చేసేలా బీజేపీ అధిష్ఠానాన్ని ఒప్పించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు భావిస్తోన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా లతా రజనీకాంత్ ఇప్పటికే కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు కొందరు బీజేపీ అగ్రనేతలను స్వయంగా కలిసి చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కూడా కలిసి తన ప్రతిపాదనను వివరించడానికి ఆమె గట్టిగానే ప్రయత్నాలు సాగిస్తున్నారు.
రజనీకాంత్ సమకాలీకుడు కమల్ హాసన్ ఇప్పటికే డీఎంకే మద్దతుతో రాజ్యసభకు వెళ్లిన విషయం తెలిసిందే. మక్కల్ నీథి మయ్యం పార్టీని స్థాపించినప్పటికీ.. దానికి అనుకున్నంత ప్రజాదరణ లభించట్లేదు. దీంతో కమల్ హాసన్ డీఎంకేకు తన పూర్తిస్థాయి మద్దతును ప్రకటించారు. ఇందులో భాగంగా ఆ పార్టీ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. పెద్దల సభలో ఎంట్రీ ఇచ్చారు. రజినీకాంత్ కుటుంబం కూడా జాతీయ స్థాయిలో తమ ఉనికిని బలంగా చాటుకోవాలని ప్రయత్నిస్తోందనేది స్పష్టమవుతోంది.
విజయ్ అధికారంలోకి వచ్చిన కొత్తలో లత రజినీకాంత్ ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. దీనిపేరు 'మక్కల్ మేడై'. సమాజంలో సానుకూల మార్పు కోరుకునే ప్రజలందరూ ఈ వేదికలో భాగస్వాములు కావాలని ఆమె అప్పట్లో పిలుపునిచ్చారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ భార్యగా లతా రజనీకాంత్ సుపరిచితురాలు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. 1958 మార్చి 2న చెన్నైలో జన్మించారు. ఆమె అసలు పేరు లతా రంగాచారి. యతిరాజ్ విమెన్స్ కాలేజీలో ఇంగ్లీష్ లిటరేచర్ పూర్తి చేశారు. ప్రముఖ నటుడు వైజీ మహేంద్రన్ సమీప బంధువు. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ ఆమె సోదరుని కుమారుడే. 1981 ఫిబ్రవరి 26న తిరుపతిలో రజినీకాంత్ ను పెళ్లాడారు. రజినీకాంత్ దంపతులకు ఐశ్వర్య, సౌందర్య అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.













Click it and Unblock the Notifications
