ఏమనుకుంటున్నావ్: నీ ఫోటో కు దండ వేసేస్తాం
న్యూఢిల్లీ: విదేశాలలో తలదాచుకున్న మాఫియా డాన్ రవి పూజారి మరో సారి ప్రముఖ వ్యక్తి ని బెదిరించారని పోలీసు అధికారులు కేసు నమోదు చేశారు. జాతీయ స్థాయిలో కీలకమైన కేసులు వాదించే ఖరీదైన న్యాయవాదులలో ఒకరైన హరీష్ సాల్వేకు మాఫియా డాన్ రవి పూజారి నుంచి బెదిరింపులు వచ్చాయి.
హరీష్ సాల్వే ఏమనుకుంటున్నాడు ఆయన ఫొటోకు దండ వేసేస్తాం జాగ్రత్త అని బెదిరించారని వెలుగు చూసింది. న్యూఢిల్లీలోని హరీష్ సాల్వే కార్యాలయానికి +61 (ఆస్ట్రేలియా) నెంబరు నుంచి బెదిరింపు ఫోన్ వచ్చిందని, అయితే ఆ సమయానికి హరీష్ సాల్వే వేరే దేశంలో ఉన్నారని పోలీసులు అంటున్నారు.
అయితే మాఫియా డాన్ రవి పూజారి బెదరించాడా, లేదా అనే విషయాన్ని హరీష్ సాల్వే కార్యాలయ వర్గాలు నిర్ధారించడం లేదు. చాలాకాలంగా విదేశాలలలో తలదాచుకున్న రవి పూజారి ఢిల్లీలో ఓ ప్రముఖుడిని బెదిరించడం ఇదే మొదటిసారి అని పోలీసులు అంటున్నారు.
రవి పూజారి ఎక్కువగా ముంబై, కర్ణాటకలోనే అతడి కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. ఈ కాల్ ఆస్ట్రేలియాలోని న్యూకేజిల్ నగరం నుంచి వచ్చినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. దాన్ని బట్టి రవి పూజారి ఎక్కడున్నాడో తెలుసుకునేందుకు పోలీసులు అక్కడి అధికారులను సంప్రదించాలని ప్రయత్నిస్తున్నారు.

ఈ విషయపై ఇప్పటికే కేంద్ర హోంశాఖ, విదేశీ వ్యవహారాల శాఖలకు కూడా సమాచారం అందించారు. కర్ణాటకకు చెందిన రవి పూజారి భార్య పద్మ, 14 ఏళ్ల కొడుకు గత సంవత్సరం ముంబై ఎయిర్పోర్టులో పోలీసులకు పట్టుబడ్డారు.
అదే సమయంలో జమాయిత్ ఉల్ ఉలేమా లీగల్ సెల్ కార్యదర్శి గుల్జార్ అజ్మీని బెదిరించినందుకు రవి పూజారిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయ్యింది. ముంబై, బెంగళూరు, మంగళూరు, మైసూరు, హుబ్బళి-దారవాడ తదితర నగరాలలో ఉంటున్న వ్యాపారులు, బిల్డర్లను రవి పూజారి బెదిరిస్తున్నాడు.
తరువాత వారి దగ్గర భారీగా హఫ్తా వసూలు చేస్తున్నాడని పలు కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్ర, కర్ణాటకలో అతనికి చాల మంది అనుచరులు ఉన్నారు. అడిగినంత హఫ్తా ఇవ్వని వారిని, పోలీసులకు సమాచారం ఇచ్చిన వ్యాపారుల మీద రవి పూజారి అనుచరులు కాల్పులు జరిపిన సంఘటనలు, హత్యలు చేసిన సంఘటన చాలనే ఉన్నాయి.












Click it and Unblock the Notifications