వాయుగుండంగా లెహర్: మధ్యాహ్నం తీరం దాటే ఛాన్స్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలను వణికిస్తున్న లెహర్ తుఫాను మరింత బలహీనపడి తీవ్రవాయుగుండంగా మారినట్లు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. మధ్యాహ్నం మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశముంది. లెహర్ ప్రభావం ముందుగా ఊహించినంతగా ఉండదంటున్నారు.
లెహర్ కారణంగా రాగల ఇరవై నాలుగు గంటలలో కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 నుండి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

లెహర్ దిశ మారడంతో పాటు, దాని తీవ్రత తగ్గిందని భారత వాతావరణ శాఖ బుధవారం ప్రకటించడంతో ప్రభుత్వం కాస్త ఊపిరిపీల్చుకుంటోంది. తుపాను తీరం దాటే సమయంలో గాలి వేగం 80 నుండి 100 కిలోమీటర్లు ఉంటుందని తాజాగా అంచనావేశారని విపత్తుల నిర్వహణ కమిషనర్ పార్థసారథి తెలిపారు.
మొదటి అంచనా ప్రకారం గాలివేగం 170 నుండి 200 కిలోమీటర్ల వరకు ఉంటుందని భావించారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సాంకేతిక కారణాల వల్ల లెహర్ తీవ్రత తగ్గిందన్నారు. గురువారం మధ్యాహ్నానికి తీరం దాటుతుందని, ప్రభుత్వం అప్రమత్తంగానే ఉందని వివరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామన్నారు.
కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 61 మండలాల పరిధిలోని 764 గ్రామాలను ప్రమాదభరిత గ్రామాలుగా గుర్తించి, ఈ గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ప్రత్యేక వాహనాల్లో తరలిస్తున్నామన్నారు. వీరికోసం 101 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, భోజనం, తాగునీరు, మందులు తదితర నిత్యావసరాలను ఏర్పాటు చేశామని వివరించారు.
ఇప్పటికే నిర్ణయించినట్టు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్), రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, నావికాదళం, సైనికదళం, కోస్టల్ గార్డ్స్ తదితర దళాల సేవలను వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. తుపాను తీవ్రంగా ఉన్న సమయంలో సముద్రం నీరు అరకిలోమీటర్ వరకు తీరం దాటి వస్తుందని, నదులు సముద్రంలో కలిసే చోట ఐదుకిలోమీటర్ల వరకు సముద్రం నీరు నదీగర్భంలోకి వస్తుందని పార్థసారథి తెలిపారు. తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
తీరం వైపు దూస్తున్న లెహర్ తుపానుతో తూర్పుగోదావరి జిల్లాలోని తీరగ్రామాలు గజగజ వణుకుతున్నాయి. హెలెన్ తుపాను సృష్టించిన విధ్వంసం నుండి ఇంకా పూర్తిగా తేరుకోకుండానే విరుచుకుపడటానికి లెహెర్ ఉరుకులు, పరుగులు మీద వస్తుండటంతో తీరగ్రామాల ప్రజలకు కంటి మీద కునుకులేకుండా పోయింది.












Click it and Unblock the Notifications