తృణమూల్ రెబెల్స్ కు ఈసారి లోక్ సభ షాక్..! 7 రోజుల డెడ్ లైన్..!
పశ్చిమబెంగాల్లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC) ఓటమి పాలయ్యాక వరుసగా నేతలు ఫిరాయింపులు మొదలుపెట్టారు. ఇదే క్రమంలో అసెంబ్లీలో దాదాపు 40 మందికి పైగా ఎమ్మెల్యేలు వేరు కుంపటి పెట్టుకోగా.. లోక్ సభలో 20 మంది ఎంపీలు ఇలాగే వేరు పడి, అనంతరం త్రిపురకు చెందిన ఎన్సీపీఐ అనే ఓ చిన్న పార్టీలో విలీనమైపోయారు. అయితే ఆ సంతోషం మాత్రం వారికి ఎక్కువ రోజులు ఉండేలా కనిపించడం లేదు. దీనికి కారణం సుప్రీంకోర్టు (Supreme Court), లోక్ సభ (Lok Sabha) స్పందిస్తున్న తీరే.
తాజాగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది రెబెల్ ఎంపీలకు, వారిపై అనర్హత వేటు ఎందుకు వేయకూడదో ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఈ నోటీసులు ఇచ్చింది. వీరంతా పార్టీ ఫిరాయింపులపై వివరణ ఇవ్వాలని కోరింది. అయితే అదే సమయంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు కూడా నోటీసులు ఇవ్వాలని పిటిషనర్ అభిషేక్ బెనర్జీ కోరారు. దీనిపై లోక్ సభ స్పీకర్ తరఫున విచారణకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ఆయన ఇప్పటికే వీరికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. దీంతో సుప్రీంకోర్టు ఆయనకు నోటీసు పంపేందుకు నిరాకరించింది.

సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే తృణమూల్ రెబెల్ ఎంపీలకు లోక్ సభ సచివాలయం స్పీకర్ ఆదేశాలతో అనర్హత నోటీసులు పంపింది. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో విలీనమైన 20 మంది రెబెల్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలకు, ఫిరాయింపుల కారణంగా వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సమాధానం ఇవ్వడానికి లోక్‌సభ సచివాలయం ఏడు రోజుల గడువు ఇచ్చింది. దీంతో ఒకే సమయంలో అటు సుప్రీంకోర్టు.. ఇటు లోక్ సభ స్పీకర్ కూ ఫిరాయింపులపై ఈ 20 మంది రెబెల్ ఎంపీలు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే వీరిపై అనర్హత వేటు పడే ప్రమాదం ఉంటుంది. ఇలా నోటీసులు అందుకున్న తృణమూల్ రెబెల్ ఎంపీల్లో కకోలి ఘోష్ దస్తిదార్, సుదీప్ బంద్యోపాధ్యాయ, శతాబ్ది రాయ్, ప్రసూన్ బెనర్జీ, రచనా బెనర్జీ, జగదీష్ చంద్ర బర్మా బసునియా, పార్థ భౌమిక్, అరూప్ చక్రవర్తి, అధికారి దీపక్ దేవ్, సయానీ ఘోష్, బాపి హల్దార్, ఎండి అబు తాహెర్ ఖాన్, కాలిపడా సరేన్ ఖేర్వాల్, అసిత్ కుమార్ మాల్, జూన్ మాలియా, మితాలీ బాగ్, ఖలీలుర్ రెహమాన్, మాలా రాయ్, షర్మిలా సర్కార్ మరియు యూసుఫ్ పఠాన్ ఉన్నారు.














Click it and Unblock the Notifications