ప్రతిపక్షాల మెరుపు ఆందోళన- జంతర్ మంతర్ వైపు
విపక్షాల నిరసనలతో దేశ రాజధానిలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తీరును నిరసిస్తూ ఇండియా కూటమి ఎంపీలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ప్రతిపక్ష ఎంపీలు బస్సుల్లో జంతర్ మంతర్ వైపు తరలివెళ్లారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికే ఈ పోరాటమని వారు స్పష్టం చేశారు.
ఈ నిరసన కార్యక్రమానికి ముందు జనపథ్‌లోని ప్రసిద్ధ సాగర్ రత్న రెస్టారెంట్‌లో విపక్ష ఎంపీలందరికీ మల్లికార్జున ఖర్గే మధ్యాహ్న భోజన విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న శైలిపై నేతలు చర్చించారు. అనంతరం రాహుల్ గాంధీ సహా ముఖ్య నేతలంతా కలిసి ఒకే బస్సులో నిరసన ప్రదేశమైన జంతర్ మంతర్ వైపు బయలుదేరారు. ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

బస్సు బయలుదేరడానికి ముందు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విలేకరులతో మాట్లాడారు. కేంద్రం ఎన్ని కేసులు పెట్టినా తమ పోరాటం ఆగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇండియా బ్లాక్ లో ఎటువంటి పొరపచ్చాలు లేవని, తామంతా ఐక్యంగా ఉన్నామని అన్నారు. తమ మధ్య లేనిపోని విభేదాలను సృష్టించడానికి, అబద్ధాలను ప్రచారం చేయడానికి ఎవరు ప్రయత్నిస్తోన్నారనేది బహిరంగ రహస్యమేనని వ్యాఖ్యానించారు.
ఎన్నికల సంఘం తప్పుడు నిర్ణయాల ద్వారా ప్రధాని మోదీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలని చూస్తున్నారని మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు. రాజ్యాంగాన్ని కూడా కేంద్రం గౌరవించట్లేదని, అలాంటప్పుడు రాజ్యాంగ బద్ధ సంస్థలకు ఏ మాత్రం విలువ ఇస్తారని నిలదీశారాయన. వాటిని పరిరక్షించడానికే 140 కోట్ల మంది ప్రజల హక్కుల కోసం ఈ పోరాటాన్ని దేశవ్యాప్తంగా సాగిస్తామని, విరమించే ప్రసక్తే లేదని అన్నారు.
దీనిపై తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి కేంద్రం తీరుపై విరుచుకుపడ్డారు. దేశంలో దాదాపు 13 కోట్ల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు. ప్రజలను ద్వితీయశ్రేణి పౌరులుగా మార్చడానికి కేంద్రం కుట్ర పన్నిందని, దీనికి కేంద్ర ఎన్నికల కమిషన్ పూర్తిస్థాయిలో సహకరిస్తోందని ధ్వజమెత్తారు. దీనిపై తాము రాజీలేని పోరాటం చేస్తోన్నామని పేర్కొన్నారు. దేశంలో ఓటు హక్కు కలిగిన వారు, ఓటు హక్కు లేనివారు అనే వివక్ష ఉండకూడదు మల్లు రవి తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications
