సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం!
మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలోని నాగ్‌పూర్ రోడ్డు, సిమారియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పాల్గొన్న బహిరంగ సభకు హాజరై తిరిగి వెళ్తున్న ప్రయాణీకుల బస్సు.. ఎదురుగా వస్తున్న ఓ పికప్ వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి రెండు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి.
10 మంది దుర్మరణం
ఈ విషాద ఘటనలో మొత్తం 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో ఆరుగురు పురుషులు, ముగ్గురు మహిళలతో పాటు ఓ చిన్నారి కూడా ఉండటం అందరినీ కలచివేసింది. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో మరో 31 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ముగ్గురు లేదా నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం వారిని వెంటనే నాగ్‌పూర్ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన బాధితులు స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

స్పందించిన ముఖ్యమంత్రి మోహన్ యాదవ్
ఈ ఘటనపై సీఎం మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. ప్రభుత్వం తరఫున తక్షణ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా బాధితులందరికీ అయ్యే వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని.. వారికి చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
సహాయక చర్యలు
ప్రమాద సమాచారం అందిన వెంటనే జిల్లా కలెక్టర్ హరేంద్ర నారాయణ్, ఎస్పీ అజయ్ పాండే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. గాయపడిన వారికి సకాలంలో వైద్యం అందించేందుకు జబల్‌పూర్, నాగ్‌పూర్ నుంచి ప్రత్యేక వైద్య బృందాలను రప్పించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications