Udayanidhi Stalin: ఉదయనిధికి మద్రాస్ హైకోర్టు షాక్-సనాతన వ్యాఖ్యలు విద్వేషమే..!
డెంగ్యూ, దోమలు, మలేరియా, కరోనా .. ఇలా కొన్నింటిని మనం వ్యతిరేకిస్తే సరిపోదని సమూలంగా నిర్మూలించాలంటూ సనాతన ధర్మంపై గతంలో చేసిన వ్యాఖ్యల వ్యవహారంలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కు ఇవాళ షాక్ తగిలింది. ఈ వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు ఇవి విద్వేష ప్రసంగాల్లో భాగమేనని తేల్చిచెప్పేసింది. ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది.
2023లో ఉదయనిధి సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పలు చోట్ల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అలాగే కోర్టుల్లో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఇదే క్రమంలో మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ లోనూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్దానం.. ఇవాళ వాటిని విద్వేష వ్యాఖ్యలు గానే తేల్చింది. డీఎంకే 100 ఏళ్లకు పైగా హిందూ మతంపై స్పష్టమైన దాడి చేస్తోందని, మంత్రి అదే సైద్ధాంతిక వంశానికి చెందినవారని గుర్తుచేసింది.

మరోవైపు విద్వేష ప్రసంగాలు చేసిన వారు బాగానే ఉంటారని, వాటిపై స్పందించిన వారే చట్టపరంగా ఇబ్బందులు పడుతున్నారంటూ హైకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. కోర్టులు కూడా విద్వేష ప్రసంగాలపై స్పందించిన వారిని ప్రశ్నిస్తున్నాయి, కానీ వాటిని ప్రారంభించిన వ్యక్తులపై చట్టాన్ని అమలు చేయడం లేదని తెలిపింది. తమిళనాడులో మంత్రి చేసిన ద్వేషపూరిత ప్రసంగానికి సంబంధించి ఎటువంటి కేసు నమోదు కాలేదని హైకోర్టు గుర్తుచేసింది.
ఉదయనిధి స్టాలిన్ ఉపయోగించిన పదాలు వాస్తవానికి ఏదో ఒక రూపంలో జాతి నిర్మూలనను సూచిస్తాయని, ద్వేషపూరిత ప్రసంగానికి సమానమని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. సనాతన ఒజిప్పు అనే తమిళ పదబంధం స్పష్టంగా జాతి నిర్మూలన లేదా సంస్కృతి హత్య అని అర్థం అని తెలిపింది. అటువంటి పరిస్థితులలో మంత్రి ప్రసంగాన్ని ప్రశ్నించిన పిటిషనర్ పోస్ట్ ద్వేషపూరిత ప్రసంగం కాదని తేల్చింది. గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా వివాదం చెలరేగడంతో ఉదయనిధి తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ.. తాను వాటికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. అయితే తన వ్యాఖ్యలు సనాతన ధర్మాన్ని అనుసరించే వ్యక్తుల మారణహోమానికి పిలుపు కాదని స్పష్టం చేశారు.

గతేడాది జనవరిలో సనాతన ధర్మం' వ్యాఖ్యలకు సంబంధించి ఉదయనిధిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన మూడు రిట్ పిటిషన్లను స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువడింది.












Click it and Unblock the Notifications