సీఎం కుర్చీ చేజారినట్టే- బిగ్ షాక్: ఆసుపత్రిలో షిండే అడ్మిట్
New Maharashtra CM: మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రోజురోజుకూ అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక వ్యవహారంలో ఏక్‌నాథ్ షిండే తన మనసు మార్చుకోకపోవడం దీనికి ప్రధాన కారణం. స్వయంగా భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జోక్యం చేసుకున్నా ఆయన మెట్టు దిగట్లేదు.
సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 145 సీట్ల సంఖ్యా బలం బీజేపీకి లేదు. 149 సీట్లల్లో పోటీ చేసి 132 చోట్ల గెలిచిందీ పార్టీ. షిండే వర్గం శివసేన 81 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టగా 57 మంది గెలుపొందారు. అజిత్ వర్గానికి చెందిన ఎన్సీపీ మొత్తం 59 స్థానాల్లో పోటీ చేయగా 41 సీట్లు ఈ పార్టీ ఖాతాలో పడ్డాయి.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మిత్రపార్టీల మద్దతు తప్పనసరి కావడంతో ముఖ్యమంత్రి పదవి కోసం శివసేన భీష్మించింది. షిండేకు మరోసారి అవకాశం ఇవ్వాలని లేదా కనీసం 50:50 పవర్ షేర్ ఫార్ములాను అయినా అంగీకరించాలని ప్రతిపాదిస్తోంది. అవేవీ వాస్తవ రూపాన్ని దాల్చట్లేదు.
ఇప్పటివరకు షిండే శివసేన పెట్టిన ఏ ఒక్క డిమాండ్‌కు కూడా బీజేపీ పెద్దలు తల ఊపలేదు. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వైపే మొగ్గు చూపుతోందా పార్టీ. ఆయనకే ముఖ్యమంత్రి పగ్గాలను అప్పగించడానికి రంగం సిద్ధం చేసింది. ప్రమాణ స్వీకార ఏర్పాట్లు కూడా చేపట్టింది కూడా.
ఈ నెల 5వ తేదీన ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో కొత్త ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేయడం దాదాపుగా ఖాయమైంది. ముఖ్యమంత్రి పగ్గాలను తామే అందుకోబోతున్నామంటూ బీజేపీ కేంద్ర పరిశీలకుడు, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రుపాణీ స్పష్టం చేశారు.
ఆయన ఈ ప్రకటన చేసిన కొద్ది సేపటికే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అనారోగ్యానికి గురయ్యారు. ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. థానెలోని జుపిటర్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. ఆరోగ్యం నిలకడగా ఉందని, దీనిపై ఎలాంటి ఆందోళన అక్కర్లేదని డాక్టర్లు చెబుతున్నారు.
ఇటీవలే షిండే అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా రెండున్నరేళ్ల పాటు విశ్రాంతి లేకుండా పని చేశారు. అనంతరం ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, రోడ్ షోలు, బహిరంగ సభల్లో విస్తృతంగా పాల్గొన్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ సుడిగాలి పర్యటనలను నిర్వహించారు.
ఫలితంగా అనారోగ్యానికి గురయ్యారు. జ్వరం, గొంతునొప్పితో బాధపడ్డారు. ఈ కారణంతోనే సతారా జిల్లాలోని తన స్వగ్రామం దరేటంబ్‌కు వెళ్లారు. నాలుగు రోజుల పాటు అక్కడే గడిపారు. విశ్రాంతి తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం థానేకి తిరిగి వచ్చారు. అయినప్పటికీ- షిండే ఆరోగ్యం కుదుటపడలేదు.
ఈ ఉదయం మరోసారి జ్వరం సోకింది. గొంతు నొప్పి తిరగబెట్టింది. బాడీ పెయిన్స్ ఇబ్బందికి గురి చేశాయి. దీనితో హుటాహుటిన థానేలోని జుపిటర్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. షిండేకు పూర్తి బాడీ చెకప్ చేయాల్సి ఉందని, డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రి యాజమాన్యం తెలియజేసింది.
ప్రస్తుతం షిండే ఆరోగ్యం నిలకడగా ఉందని చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్ ఎం పత్రే చెప్పారు. జ్వరం, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, జలుబుతో బాధపడుతున్నారని, దీనికి తగ్గ ట్రీట్‌మెంట్ అందిస్తోన్నామని అన్నారు. యాంటీ బయాటిక్స్ ఇచ్చామని, ఆయా విభాగాల్లో నిపుణులైన డాక్టర్ల బృందం పర్యవేక్షణలో ఉన్నారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications