అనుకున్నది సాధించిన అజిత్..!!
ముంబై: మహారాష్ట్రలో ఎట్టకేలకు కొత్త మంత్రుల శాఖల కేటాయింపు పూర్తయింది. శాఖల కోసం పట్టుబట్టిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్.. పట్టుబట్టి మరీ అనుకున్నది సాధించారు. కీలక శాఖలను ఇప్పించుకోగలిగారు. కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి శాఖలను కేటాయిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఎన్సీపీకి చెందిన కీలక నేత అజిత్ పవార్.. కొద్దిరోజుల కిందటే- పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే. తన వర్గానికి చెందిన 35 మంది శాసన సభ్యులతో కలిసి ఆయన అధికార శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం)- బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. తమదే అసలైన ఎన్సీపీగా ప్రకటించుకున్నారు. ఆ వెంటనే ఉప ముఖ్యమంత్రిగానూ ప్రమాణ స్వీకారం చేశారు.

అజిత్ పవార్‌తో పాటు ఛగన్ భుజ్‌బల్, ధనంజయ ముండే, హసన్ ముష్తాఫిర్, దిలీప్ వల్సే పాటిల్, ధర్మారావ్ ఆత్మారామ్, ఆదితి తట్కరే, అనిల్ పాటిల్, సంజయ్ బన్సొడే.. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతా బాగానే ఉన్నప్పటికీ- శాఖల కేటాయింపు వద్ద ప్రతిష్ఠంభవన నెలకొంది.
ప్రమాణ స్వీకారం చేసి.. రోజులు గడుస్తున్నప్పటికీ- కొత్త ముఖాలకు శాఖలను మాత్రం కేటాయించలేదు ఇన్నిరోజులు. కీలకమైన శాఖలు తమకు కావాలంటూ అజిత్ పవార్ వర్గం పట్టుబట్టడమే దీనికి ప్రధాన కారణం. ప్రాధాన్యత లేని శాఖలను కేటాయించడాన్ని ముందు నుంచీ వ్యతిరేకిస్తూ వచ్చారు. దీనితో శాఖల కేటాయింపు కొలిక్కి రాలేదు.
ఇవ్వాళ ఆ వివాదం సమసిపోయింది. కొత్త మంత్రులకు శాఖలను కేటాయిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అజిత్ పవార్‌కు కీలకమైన ఆర్థికం- ప్రణాళికల మంత్రిత్వ శాఖను కేటాయించారు. ఛగన్ భుజ్‌బల్‌కు ఆహారం- పౌరసరఫరాల శాఖ లభించింది. విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖను అనిల్ పాటిల్‌కు అప్పగించారు.
ఆదితి సునీల్ తట్కరే- మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి, ధనంజయ ముండే- వ్యవసాయం, దిలీప్ వల్సే పాటిల్- సహకార మంత్రిత్వ శాఖలు దక్కాయి. రాధాకృష్ణ వీఖే పాటిల్‌కు రెవెన్యూ- పశుసంవర్ధక శాఖను కేటాయించారు. కొత్త మంత్రులకు శాఖలను కేటాయించానికి మహారాష్ట్ర ప్రభుత్వం పెద్ద కసరత్తే చేసింది. దీనికోసం కోఆర్డినేషన్ కమిటీని సైతం వేసింది.












Click it and Unblock the Notifications