ఆ బాధ్యతను భుజానికెత్తుకున్న ప్రధాని మోదీ
Maharashtra Assembly elections 2024: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. అన్ని పార్టీలు కదనరంగంలోకి దిగాయి. జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తోన్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో బహిరంగ సభలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచార కార్యక్రమాలపై దృష్టి పెట్టాయి.
288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్రలో నవంబర్ 20వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అదే నెల 23వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో కలిపి అదే రోజున కౌంటింగ్ నిర్వహించనుంది ఈసీ. ఈ రెండు రాష్ట్రాల్లో ఎవరు అధికారంలోకి వస్తారనేది తేలేది అప్పుడే.

ఈ క్రమంలో- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహారాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. రోడ్ షోలతో హోరెత్తించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ఖరారు చేసింది మహారాష్ట్ర బీజేపీ. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ పర్యటించేలా షెడ్యూల్‌ను రూపొందించారు.
ఈ నెల 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అంటే వారం రోజుల పాటు ప్రధాని మోదీ బహిరంగ సభలు మహారాష్ట్రలో ఏర్పాటు కానున్నాయి. 11 చోట్ల బహిరంగ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. మరి కొన్ని చోట్ల రోడ్ షోలను నిర్వహించనున్నారు. మహారాష్ట్ర బీజేపీ నాయకులతో విస్తృత సమావేశాల్లో పాల్గొంటారు. నాయకులకు దిశా నిర్దేశం చేస్తారు.
8వ తేదీన ధూలేలో నిర్వహించబోయే బహిరంగ సభతో మోదీ ఎన్నికల ప్రచారానికి తొలి అడుగు పడుతుంది. అదే రోజున నాసిక్ సభలో ప్రసంగిస్తారు. 9వ తేదీన అకోలా, నాందెడ్‌లల్లో పర్యటిస్తారు. 12వ తేదీన చంద్రాపూర్, చిమూర్, షోలాపూర్, పుణేకు వెళ్తారు. పార్టీ నాయకులు, స్థానిక అభ్యర్థులతో కలిసి రోడ్ షో, బహిరంగ సభల్లో పాల్గొంటారు. 14వ తేదీన శంభాజీ నగర్, నవీ ముంబై, ముంబైల్లో మోదీ రోడ్ షో, బహిరంగ సభలు ఉంటాయి.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సింగ్ సహా పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా మహారాష్ట్రలో సుడిగాలి పర్యటనలను నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications