కోవిషీల్డ్: సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌లో భారీ అగ్నిప్రమాదం: దట్టంగా కమ్ముకొన్న పొగ: పీఎంఓ ఆరా?
ముంబై: సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎష్ఐఐ)లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మహారాష్ట్రలోని పుణేలో గల యూనిట్‌లో ఈ మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌లోని టెర్మినల్ గేట్ నంబర్-1 నుంచి దట్టమైన నల్లటి పొగలు వెలువడటం భయాందోళనలకు దారి తీసింది. స్థానికుల్లో కలకలం రేపింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక బలగాలు, రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తీసుకొస్తున్నాయి.
ఈ ఘటన పట్ల ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఆరా తీసినట్లు చెబుతున్నారు. ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి ఉద్దేశించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను భారత్‌లో ఉత్పత్తి చేస్తోంది సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సంస్థే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశవ్యాప్తంగా జోరుగా కొనసాగుతోన్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను విస్తృతంగా వినియోగిస్తోన్న విషయం తెలిసిందే. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ను సీరమ్ సంస్థ తయారు చేస్తోంది.

ఈ మధ్యాహ్నం టెర్మినల్ గేట్ నంబర్-1 వద్ద మంటలు చెలరేగాయి. దీనికి గల కారణాలు ఇంకా తెలియరావట్లేదు. తొలుత దట్టమైన పొగ వెలువడింది ఆ వెంటనే అగ్నికీలలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక శకటాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తీసుకుని రావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మంటలను ఆర్పివేయడానికి పదికి పైగా అగ్నిమాపక శకటాలను వినియోగిస్తున్నారు.
Fire in Serum Institute of India at Pune.. Accident or Sabotage??
— Mohil Malhotra🇮🇳मोहिल मल्होत्रा (@TheMohil8) January 21, 2021
ఈ ప్రమాదంలో ఎంతమేర ఆస్తినష్టం సంభవించింది? దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందనే విషయాలపై ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది. వ్యాక్సినేషన్ కోసం వినియోగిస్తోన్న కోవిషీల్డ్ తయారీ సంస్థలో ఘటన చోటు చేసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తమౌతోంది. ప్రధానమంత్రి కార్యాలయం దీనిపై ఆరా తీసిందని అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అందజేయాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి కార్యాలయం సూచించిందని సమాచారం.












Click it and Unblock the Notifications