గాంధీజీ మనవడి ఆస్తిపై కన్ను.. 30 ఎకరాలు కొట్టేయాలని చూశాడు..
జాతిపిత మహాత్మా గాంధీ చూపిన సత్యం, ధర్మం మార్గానికి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి గౌరవం ఉందో మరోసారి నిరూపితమైంది. అమెరికాలోని వర్జీనియాలో మహాత్మా గాంధీ మనవడు దివంగత కనూ గాంధీ, ఆయన సతీమణి శివా గాంధీకి చెందిన 30 ఎకరాల విలువైన భూమిని ఒక స్థానికుడు అక్రమంగా ఆక్రమించుకునేందుకు పన్నిన కుట్ర నీరుగారిపోయింది. గుజరాత్‌కు చెందిన ఒక ట్రస్టీ చాకచక్యంగా, పట్టుదలతో సాగించిన 20 నెలల సుదీర్ఘ న్యాయపోరాటం ఫలితంగా ఆ భూమికి ఎట్టకేలకు విముక్తి లభించింది.
1987వ సంవత్సరంలో కనూ గాంధీ దంపతులు వర్జీనియాలోని ప్రముఖ షెనాండో నేషనల్ పార్క్‌ను ఆనుకుని ఉన్న 30 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. జీవిత చరమాంకంలో భారత్‌కు తిరిగి వచ్చిన వారు దక్షిణ గుజరాత్లో స్థిరపడ్డారు. 2016లో కనూ గాంధీ, 2020లో శివా గాంధీ కన్నుమూశారు. అయితే, తమ ఆస్తులన్నింటినీ గాంధేయవాద ప్రచారానికి, సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించాలనే మంచి సంకల్పంతో 'డాక్టర్ శివా అండ్ కనూ రామదాస్ మోహన్‌దాస్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్'ను ఏర్పాటు చేసి, ఈ స్థలాన్ని ట్రస్ట్‌కు బదిలీ చేస్తూ వీలునామా రాశారు. ప్రస్తుతం ఈ ట్రస్ట్‌కు సూరత్‌కు చెందిన పరిమళ్ దేశాయ్ మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు.

భూమి కొట్టేసేందుకు 'అడ్వర్స్ పొసెషన్' ఎత్తుగడ!
2025 జనవరిలో గ్రెగొరీ బ్లాక్ అనే వర్జీనియా స్థానికుడు పరిమళ్ దేశాయ్‌కి ఒక లీగల్ నోటీసు పంపడంతో ఈ భూ వివాదం వెలుగులోకి వచ్చింది. వర్జీనియా చట్టాల ప్రకారం ఒక స్థలంలో వరుసగా 15 ఏళ్లు నివాసముంటే అది ఆక్రమణదారుడికే చెందుతుందనే 'అడ్వర్స్ పొసెషన్' నియమాన్ని ఆధారంగా చేసుకుని ఆ 30 ఎకరాల భూమి తనదేనంటూ బ్లాక్ కోర్టును ఆశ్రయించాడు. 2008 నుంచే తాను అక్కడ క్యాబిన్, దారులు, వృక్షాల పెంపకం చేపట్టానని, దానికి సంబంధించిన ఫొటోలను ఆధారాలుగా చూపించే ప్రయత్నం చేశాడు.
గుజరాత్ ట్రస్టీ ధీటైన పోరాటం.. బయటపడ్డ అసలు రంగు!
ట్రస్ట్ ఆస్తిని కాపాడుకోవడానికి మేనేజింగ్ ట్రస్టీ పరిమళ్ దేశాయ్ గట్టి పట్టుదలతో రంగంలోకి దిగారు. అమెరికాలో లాయర్లను నియమించుకుని, సరిహద్దుల సర్వే కోసం నిధులను వెచ్చించి పక్కా ఆధారాలు సేకరించారు. కోర్టు విచారణ సమయంలో శాటిలైట్ (GIS) మ్యాప్‌ల ద్వారా ఆ స్థలంలో సదరు ఆక్రమణదారుడు చెబుతున్న క్యాబిన్ 15 ఏళ్లుగా లేదని నిరూపించారు. అంతేకాకుండా, 2020 నుంచి తాము తరచూ ఆ స్థలాన్ని సందర్శిస్తున్నామని, అక్కడ మరొక మహిళ కూడా నివసిస్తోందని చూపించి.. ఆక్రమణదారుడి వాదనలో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పారు. ఇది మహాత్ముడి వారసుల ఆస్తి అని, గాంధేయ భావజాల ప్రచారానికే దీన్ని ఉపయోగిస్తున్నామని కోర్టుకు వివరించారు.
కోర్టు సంచలన తీర్పు.. ఆక్రమణదారుడికి చురకలు!
రెండు వైపుల వాదనలు విన్న వర్జీనియాలోని వారెన్ కౌంటీ సర్క్యూట్ కోర్టు న్యాయమూర్తి డారిల్ ఎల్. ఫంక్ తీర్పునిస్తూ.. ఆక్రమణదారుడి వాదనలను పూర్తిగా కొట్టిపారేశారు. అక్రమ ఆక్రమణను తక్షణమే తొలగించి, స్థలాన్ని తిరిగి ట్రస్ట్‌కు అప్పగించాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా, కోర్టు ఖర్చుల కింద నిందితుడు $11,375 జరిమానా చెల్లించాలని ఆదేశించారు. ఈ చారిత్రాత్మక తీర్పుతో అమెరికాలో గాంధీజీ వారసత్వ ఆస్తికి సంపూర్ణ రక్షణ లభించింది.














Click it and Unblock the Notifications
