మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరితస్తున్నట్లు సమాచారం అందడంతో పెద్ద మొత్తంలో పోలీసు బలగాలు కూంబింగ్ చేపట్టాయి.
బస్తర్ రేంజ్‌లో ఉన్న నాలుగు జిల్లాల(నారాయణపూర్, దంతెవాడ, జగదల్పూర్, కొండగావ్) బలగాలు మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఆ తర్వాత పోలీసులపై మావోయిస్టులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో పోలీసు బలగాలు కూడా మావోయిస్టులపై ఎదురుకాల్పులకు దిగాయి.

గురువారం తెల్లవారుజాము నుంచే పోలీసు బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. కూంబింగ్‌లో డీఆర్ జీ, ఎస్ టీఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలు పాల్గొన్నాయి. కాగా, సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా ఇప్పటివరకు యూనిఫాంలు ధరించిన ఏడుగురు గుర్తుతెలియని నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ ఐజీ పీ సుందర్రాజ్ తెలిపారు.
మృతుల సంఖ్య పెరిగే అవకాశముందన్నారు. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో మావోయిస్టుల కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. తాజా ఎదురుకాల్పుల ఘటనపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ స్పందించారు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌లో ఏడుగురు మావోయిస్టులను మట్టుబెట్టడంలో భద్రతా దళాలు విజయం సాధించాయని అన్నారు.
'ముందస్తు సమచారంతో ఈ రోజు(గురువారం) ఈ చర్యలు తీసుకున్నాం. గత ఐదేళ్లలో 219 మంది నక్సలైట్లు చనిపోయారు. కానీ ఈ ఏడాది ఇప్పటివరకు 220మంది నక్సలైట్లు మృతిచెందారు' అని ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ వెల్లడించారు. మరోవైపు, గత వారం రోజుల వ్యవధిలో ఇన్ఫర్మర్ల నెపంతో ఐదుగురు బీజేపీ కార్యకర్తలను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు.
కాగా, డిసెంబర్ 15న కేంద్ర హోం మంత్రి అమిత్ షా బస్తర్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు దళం యాక్టివ్ అయ్యిందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమై పోలీసులు, బస్తర్ రేంజ్‌లోని నాలుగు జిల్లాల నుంచి దాదాపు వేయి మంది భద్రతా బలగాలను రంగంలోకి దింపారు. మావోయిస్టుల ఆచూకీ కోసం భారీ ఆపరేషన్ చేపట్టారు.












Click it and Unblock the Notifications