స్టాలిన్ కు ఎదురుదెబ్బ- ఇకపై ఆయనకు: సీఎం విజయ్ దూకుడు
తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తోన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం డీలా పడ్డ డీఎంకే వరుస షాకులు తగులుతున్నాయి. రాజకీయంగా ఆ పార్టీ ఎత్తుపల్లాలను చవిచూస్తూ వస్తోంది. ఇప్పటికే పలువురు సీనియర్లు, మాజీ మంత్రులు పార్టీని వీడారు. అధికార టీవీకేలో జాయిన్ అయ్యారు. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రదర్శిస్తోన్న దూకుడు కూడా డీఎంకేను డిఫెన్స్ లోకి నెట్టినట్టవుతోంది.
ఈ పరిణామాల మధ్య స్టాలిన్ డీఎంకే చీఫ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన వ్యక్తిగత భద్రతకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనకు ఇప్పటివరకు కల్పిస్తూ వచ్చిన అత్యున్నత స్థాయి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను తగ్గించింది. జెడ్ కేటగిరీకి కుదించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో జరిగిన కీలక సమీక్ష సమావేశం అనంతరం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

తాజా మార్పుల నేపథ్యంలో స్టాలిన్ సెక్యూరిటీ సిబ్బంది సంఖ్య, మోహరింపు భారీగా తగ్గుతుంది. ఈ నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా చెన్నైలోని సెనోటాఫ్ రోడ్డులో ఉన్న ఆయన నివాసం వద్ద కూడా భద్రతా ఏర్పాట్లను పోలీసులు ఇప్పటికే పునఃసమీక్షించారు. అక్కడ ఉన్న అదనపు పోలీసు బలగాలను ఉపసంహరించుకోనున్నారు. జెడ్ కేటగిరీ నిబంధనల ప్రకారం అక్కడి సెక్యూరిటీని క్రమబద్ధీకరించనున్నారు.
స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు అత్యున్నత స్థాయి జెడ్ ప్లస్ కేటగిరి రక్షణ ఉండేది. సుమారు 50 మంది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని కమాండోలతో కూడిన వ్యక్తిగత భద్రత వ్యవస్థ ఇది. రాష్ట్రంలో అధికార మార్పిడి చోటుచేసుకోవడం, ఆయన పదవిని కోల్పోయిన నేపథ్యంలో భద్రతను జెడ్ కేటగిరికి తగ్గించారు. ఇకపై ఆయనకు కమాండోల సెక్యూరిటీ చాలా పరిమితంగా ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రి కే పళనిస్వామి తరహాలోనే భద్రత లభించనుంది.
ఓ సబ్ ఇన్‌స్పెక్టర్ పర్యవేక్షణలో 22 పోలీసులు స్టాలిన్ సెక్యూరిటీ బాధ్యతలు నిర్వహిస్తారు. అలాగే కాన్వాయ్‌లో వాహనాల సంఖ్య తగ్గుతుంది కూడా. దీంతో పాటు జామర్, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ వంటి ప్రత్యేక సదుపాయాల్లో కూడా ప్రొటోకాల్ ప్రకారం కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. సాధారణంగా దేశంలో ప్రముఖుల భద్రతను కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగాల నివేదికల ఆధారంగా ప్రభుత్వం సమీక్షిస్తుంది. సంబంధిత నాయకుడికి ఉన్న ముప్పు తీవ్రతను అంచనా వేసి ఈ కేటగిరిలను నిర్ణయిస్తారు.














Click it and Unblock the Notifications