మకరజ్యోతి దర్శనం: శరుణుఘోషతో మారుమోగిన శబరిమల
శబరిమల: ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో సంక్రాంతి పండగ సందర్భంగా మకరజ్యోతి రూపంలో సోమవారం సాయంత్రం అయ్యప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. జ్యోతిని దర్శించుకునేందుకు లక్షలాది మంది అయ్యప్ప భక్తులు తరలివచ్చారు. తిరువాభరణ ఘట్టం పూర్తయ్యాక పొన్నాంబలమేడు పర్వత శిఖరాల్లో మకరజ్యోతి దర్శనమైంది.
స్వామియే శరణం అయ్యప్ప అంటూ శబరిగిరులు మారుమోగాయి. లక్షలాది మంది భక్తులు ప్రత్యక్షంగా మకరజ్యోతిని దర్శించుకుని పులకించిపోయారు. కోట్లాది మంది టీవీల్లో దర్శించుకుని భక్తపరవశులయ్యారు. జ్యోతి దర్శనం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జగరకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మకరజ్యోతి దర్శనం కోసం తరలివచ్చిన భక్తుల కోసం ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డ్ తగిన ఏర్పాట్లు చేసింది. 50 వేల మందికి ట్రావెన్ కోర్ ఆలయ బోర్డ్ టోకెన్లు ఇచ్చింది. మకరజ్యోతి దర్శనం కోసం లక్షల సంఖ్యలో తరలివచ్చే అయ్యప్ప భక్తులకు ఇబ్బందులు కలగకుండా పంబానది, సన్నిధానం, హిల్ టాప్, టోల్ ప్లాజా వద్ద జ్యోతి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేసింది.
ప్రతి సంవత్సరం మకరజ్యోతి దర్శనం ఉంటుంది. ఇక్కడి ప్రజలు దీనినే మకరవిళక్కు వార్షిక పండగ అని పిలుస్తారు. సాయంత్రం తిరువాభరణాలతో పందళ రాజవంశీయులు సన్నిధానం చేరుకుంటారు. శబరిమల ఆలయ ప్రధాన అర్చకులు వారికి స్వాగతి పలికి వారు తెచ్చిన బంగారు ఆభరణాలను అయ్యప్పకు అలంకరించారు.
అనంతరం పొన్నాంబలమేడు నుంచి మకరజ్యోతి దర్శనమిస్తుంది. మరకజ్యోని ముమ్మార్లు తనివితీరా దర్శించి ఇరుముడి సమర్పించి స్వాములు ఆధ్యాత్మిక అనుభూతిని ఆనందాన్ని పొందుతారు. కాగా, ఈ ఏడాది కోట్లాది మంది భక్తులు శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. అయితే, తాగునీరు, ఆహారం లాంటి కనీస వసతులను కూడా అక్కడి ప్రభుత్వం కల్పించలేదని పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications